భరతకు రిస్క్..రాజమండ్రి జనసేనకు?

రాజకీయాల్లో పదవుల్లో ఉండే నేతలు ప్రజలకు సేవ చేయాలి..అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏపీలో అలా పనిచేయడం కష్టం. ఇప్పుడు అని కాదు..చాలా ఏళ్ల నుంచి అధికార నేతలు అంటే..తమ సీఎంలకు భజన చేయడమే. అలాగే ప్రత్యర్ధులపై విమర్శలు చేయడమే. ఇవే పనులు..ఇంకా వేరే పనులు ఉండవు. గతంలో టీడీపీ నేతలైన, ఇప్పుడు వైసీపీ నేతలైన అదే పని.

అయితే వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో జగన్‌కు భజన చేయడం..లేదా ప్రతిపక్ష నేతలని దారుణంగా తిట్టడంలో బాగా ముందున్నారు. మరి వీరు ప్రజలకు చేసే పనులు ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియడం లేదు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పని కూడా అంతే అని టీడీపీ-జనసేన శ్రేణులు అంటున్నాయి. గత ఎన్నికల్లో తొలిసారి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి..దాదాపు లక్షా 21 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు.

మరి తొలిసారి ఎంపీగా గెలిచిన భరత్..రాజమండ్రి ప్రజలకు చేసింది ఏంటి? అంటే ఏమో ఆయన చేసింది కనబడట్లేదని ప్రతిపక్ష వర్గాల నుంచి సమాధానం వస్తుంది. ఇక ఎంపీగా ఈయన పని జగన్‌కు భజన చేయడం..ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం. తాజాగా రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో భరత్ చేసిన రచ్చ అందరికీ తెలుసని అంటున్నారు. అమరావతి వాళ్ళు వారి దారిలో వారు వెళుతుంటే..అనుచరులని తీసుకొచ్చి మూడు రాజధానుల పేరిట రచ్చ చేసి..రైతులపై వాటర్ బాటిల్స్ విసిరేశారని కథనాలు వచ్చాయి. కానీ రివర్స్‌లో రైతులే తమపై దాడి చేశారని ప్రెస్ మీట్‌లో చెప్పారు.

అయితే అక్కడ మీడియా ప్రతినిధులు..మీ అనుచరులే బాటిల్స్ వేశారని చెప్పడంతో భరత్ ఆగ్రహంతో మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. రైతులు యాత్ర చేస్తుంటే అక్కడకు అనుచరులతో వెళ్లింది భరత్. ఆ విషయం అందరికీ తెలుసు. అలాగే అక్కడ ఆయన ఏం చేశారనేది రాజమండ్రి ప్రజలకు తెలుసని, ఆయనకు మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చేది లేదని టీడీపీ-జనసేన వర్గాలు అంటున్నాయి.

రాజకీయంగా చూసుకుంటే గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే భరత్ ఈజీగా గెలిచారు. 2019లో టీడీపీపై భరత్ మెజారిటీ లక్షా 21వేలు, కానీ జనసేనకు పడిన ఓట్లు లక్షా 55 వేలు. అంటే టీడీపీ-జనసేన కలిస్తే ఏం అవుతుందో చెప్పవచ్చు. నెక్స్ట్ ఎనికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు ఫిక్స్. అయితే టీడీపీ నుంచి ఓడిపోయిన మాగంటి రూప ఇక్కడ యాక్టివ్‌గా లేరు. కాబట్టి ఈ సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం కూడా ఉంది. మొత్తానికైతే రాజమండ్రిలో భరత్‌కు రిస్క్ ఎక్కువ ఉంది.