పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?

గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్‌ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, సీఎం సీటు ఇచ్చే ప్రసక్తి ఉండదని, అవసరమైతే సింగిల్ గా పోటీ చేసి సత్తా చాటుతామని టీడీపీ శ్రేణులు చెప్పాయి.

దీంతో పొత్తు అంశం కొన్ని రోజులు చర్చకు రాలేదు. పైగా బాబు-పవన్ కలవకుండా చేయడమే వైసీపీ టార్గెట్ అయింది. కానీ వైసీపీ అనూహ్యంగా పవన్‌ని విశాఖలో నిర్భందానికి గురి చేయడం, జనసేన నేతలు, కార్యకర్తలని అరెస్ట్ చేయడం లాంటి అంశాలు హైలైట్ అయ్యాయి..ఆ వెంటనే పవన్‌కు బాబు సంఘీభావం తెలపడం, విజయవాడలో కలవడం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాడతామని చెప్పారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అని తేలిపోయింది. పొత్తు తేలడంతో సీట్ల లెక్కలపై రెండు పార్టీల్లో చర్చ నడుస్తోంది. పవన్‌కు సీఎం సీటు లేదు..కానీ జనసేనకు ఇచ్చే సీట్లు ఇవే అని ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో పిఠాపురం సీటు తమకే అని రెండు పార్టీల కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.

అయితే ఒకొనొక సమయంలో పిఠాపురంలో పవన్ పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే..పిఠాపురంలో మూడు పార్టీలకు బలం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అప్పుడు జనసేనకు 28 వేల ఓట్లు వచ్చాయి. ఒకవేళ కలిసి పోటీ చేసి ఉంటే అప్పుడే పిఠాపురం వైసీపీకి దక్కేది కాదు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ బలం తగ్గుతుంది..అదే సమయంలో టీడీపీ-జనసేన బలం పెరుగుతుంది. కానీ పొత్తు ఉంటే సీటు ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. రెండు పార్టీల శ్రేణులు మాత్రం సీటు తమకంటే తమకే అని చెబుతున్నారు. మరి చివరికి పిఠాపురం సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి. ఎవరికి దక్కినా పొత్తు ఉంటే మాత్రం ఇక్కడ వైసీపీకి చిక్కులే.