చినబాబుకు ‘ఫ్యాన్స్’ జాకీలు!

పప్పు…పప్పు ఇదే వైసీపీ…నారా లోకేష్‌ని ఉద్దేశించి అనే మాట. ఏదో చంద్రబాబు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చేశారు గాని లోకేష్ కు పెద్దగా రాజకీయం తెలియదని ఎప్పుడు ఏం మాట్లాడతారో…ఎలా మాట్లాడతారో తెలియదని చెప్పి వైసీపీ నేతలు…లోకేష్‌ని పప్పు అని పిలిచేవారు. అయితే ఇదంతా గత ఎన్నికల ముందు వరకు…గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక లోకేష్ తీరులో మార్పు వచ్చింది…గతం కంటే భిన్నంగా రాజకీయం చేస్తున్నారు…మాట తీరు మారింది…బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అలాగే వైసీపీపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు…గతంలో మాదిరిగా ఇప్పుడు తడబడటం లేదు.

ఇలా లోకేష్ మారడానికి ఎక్కువ కారణం వైసీపీ వాళ్ళే…పదే పదే పప్పు అని ఎగతాళి చేయడం వల్ల లోకేష్ పంతంతో  ఓ మాస్ నాయకుడుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇక ఇలా ఎదుగుతున్న లోకేష్‌ని…వైసీపీ నేతలు ఇంకా ఎదిగేలా చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన మంగళగిరిలో లోకేష్ బలం పెరిగిందని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర స్థాయిలో లోకేష్ ఇమేజ్ పెంచడంలో వైసీపీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఎక్కడకైనా వెళుతుంటే పోలీసుల ద్వారా లోకేష్‌ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆయన్ని అరెస్ట్ చేయిస్తున్నారు. ఆ మధ్య గుంటూరులో రమ్యా హత్య జరిగినప్పుడు కూడా లోకేష్‌ని పోలీసులు అడ్డుకున్నారు…అరెస్ట్ చేశారు. దీని వల్ల వైసీపీకి ఏం వచ్చిందో తెలియదు గాని, లోకేష్ మైలేజ్ మాత్రం పెరిగింది.

ఇక తాజాగా శ్రీకాకుళంలోని పలాసలో టీడీపీ కౌన్సిలర్…ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసారంటూ…జేసీబీతో అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేశారు. టీడీపీ కౌన్సిలర్‌కు పలాస టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష మద్ధతుగా నిలిచారు. ఆమెపై కూడా వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ పార్టీ వారికి అండగా నిలిచేందుకు పాలసకు వచ్చిన లోకేష్‌ని పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు…అరెస్ట్ చేశారు. మంత్రి అప్పలరాజు ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. అయితే మామూలుగా టీడీపీ నేత ఇంటికి లోకేష్ వెళ్ళి పరామర్శించి వెళ్లిపోతారు. ఇలా అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం వల్ల అనవసరంగా లోకేష్‌పై సానుభూతి పెరుగుతుందే తప్ప…వైసీపీకి ఒరిగేది ఏమి లేదు.