నాలుగు జిల్లాలే టీడీపీకి ప్లస్..!

ఏపీలో రాజకీయ సమీకరాణాలు మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయం…కొంతకాలం నుంచి కాస్త మారుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత కావొచ్చు…జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు…ఇలా కొన్ని పరిణామాల వల్ల వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. కాకపోతే ఇప్పటికీ వైసీపీకి అధికారంలోకి వచ్చే బలం ఉంది…గతం కంటే కాస్త బలం తగ్గింది గాని…మరీ అధికారం కోల్పోయే బలం మాత్రం తగ్గలేదు.

అటు గతంతో పోలిస్తే టీడీపీ బలం పెరిగింది గాని…అధికారంలోకి వచ్చేంత బలం పెరగలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మెజారిటీ జిల్లాల్లో వైసీపీ లీడ్ లో ఉంది. గత ఎన్నికల్లో 13 జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది…కానీ ఇప్పుడు కాస్త ఆ బలం తగ్గింది. కొన్ని జిల్లాల్లో టీడీపీ పికప్ అయింది…ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ పుంజుకుంది…ఈ జిల్లాల్లో టీడీపీ లీడ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఈ నాలుగు జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంది..రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదు గాని, ఈ నాలుగు జిల్లాల్లో జనసేన హవా ఎక్కువే. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గాని టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తే ఈ జిల్లాల్లో మళ్ళీ వైసీపీ హవానే కొనసాగుతుంది. అలా కాకుండా రెండు కలిసి పోటీ చేస్తే…వైసీపీని డామినేట్ చేస్తాయి.

అయితే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ బలంగా కనిపిస్తోది. ఇటు ఉత్తరాంధ్ర, అనంతపురం జిల్లాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ ఎదిగింది. టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వైసీపీ బలం తగ్గకుండా, టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తే…మళ్ళీ వైసీపీకే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని..ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టీడీపీ సగం బలం తెచ్చుకున్నా సరే…ఆ రెండు పార్టీలకు అధికారం దక్కే ఛాన్స్ ఉంది.