బాబు ఫిక్స్: ఆ ఇంచార్జ్‌లు అవుట్..?

టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే…పార్టీలో భారీ మార్పులు జరగాల్సిందే…పనిచేస్తున్నట్లు హడావిడి చేస్తున్న నేతలలని పక్కన పెట్టాల్సిందే…అలాగే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తే వైసీపీని ఢీకొట్టడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే దిశగా అధినేత చంద్రబాబు సైతం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఏదో మొహమాటం కొద్ది నేతలకు ఛాన్స్ ఇస్తే…టీడీపీకే నష్టం జరిగేలా ఉంది. ఈ సారి పనిచేయని నేతలని ఏ మాత్రం ఉపేక్షించే అవకాశం కనిపించడం లేదు.

ఇటీవల చంద్రబాబు వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే…నాయకులతో భేటీ అవుతూ నియోజకవర్గంలో ఉండే పరిస్తితులని తెలుసుకుంటున్నారు. అలాగే పనితీరు బాగుందనే ఇంచార్జ్‌లకు సీటు కూడా ఫిక్స్ చేస్తున్నారు. సరిగ్గా పనిచేయడం లేదనే వారికి గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో సరిగ్గా పనిచేయని ఇంచార్జ్ లని పక్కన పెట్టేయాలని బాబు ఫిక్స్ అయినట్లు సమాచారం. దాదాపు 20 నుంచి 30 ఇంచార్జ్ లని పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. బాదుడే బాదుడు కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంలో, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వెనుకబడి ఉన్నవారిని పీకేయాలని బాబు భావిస్తున్నారు. చాలామంది బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు…కొందరు మీడియా ముందే హడావిడి చేస్తున్నారు. అలాగే నియోజవర్గానికి 20 వేల మంది సభ్యత్వం చేయాలని టార్గెట్ పెట్టారు.

కానీ కొన్ని స్థానాల్లో కనీసం 3-4 వేలు కూడా దాటడం లేదని సమాచారం. ఇంచార్జ్‌లు అలసత్వం వల్లే పలు స్థానాల్లో టీడీపీ వెనుకబడి ఉందని తెలుస్తోంది. అందుకే అలా టీడీపీ వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లోని ఇంచార్జ్‌లని పీకేసి వేరే నేతలకు ఛాన్స్ ఇవ్వాలని బాబు డిసైడ్ అయినట్లు సమాచారం. త్వరలోనే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని కూడా ఖరారు చేసే ఛాన్స్ ఉంది.