థ్యాంక్యూ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ముందు నుండీ చెబుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాతో చైతూ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘మనం’ ఫేం డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
అభిరామ్(నాగచైతన్య) ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్‌మ్యాన్ గా ఎదుగుతాడు. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా పలు సవాళ్లను ఎదుర్కొని తాను సక్సెస్ అయ్యానని నమ్ముతాడు అభిరామ్. ఈ క్రమంలోనే అతడికి ఈగో పెరిగిపోతుంది. అయితే ఈ క్రమంలో ప్రియ(రాశి ఖన్నా) అతడికి ఆర్థికంగా సహాయం చేయడంతో అభిమార్ సక్సెస్‌లో అతడికి తోడుంటుంది. అయితే అభిరామ్ తన ఈగో కారణంగా అందరికీ దూరమవుతాడు. ఈ క్రమంలో ఓ ఘటన అతడికి తన చుట్టూ ఉన్నవాళ్ల విలువను తెలియజేస్తుంది. అతడికి తన జీవితంలో సక్సెస్ కావడానికి తోడ్పడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ జర్నీలో అతడికి ఎలాంటి మధురానుభూతులు మిగులుతాయి.. అతడి స్నేహితులు, శత్రువులను ఎలా కలుసుకుంటాడు అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు విక్రమ్ కుమార్ ‘వైవిధ్యం’ అనే మాటను మర్చిపోయినట్లుగా ఆయన గతకొన్ని సినిమాలు చూస్తే అర్థమవుతోంది. కేవలం స్టార్స్‌ను పెట్టుకుని కంటెంట్‌లో దమ్ములేకపోయినా సక్సెస్ కొట్టేయొచ్చు అని భావిస్తున్నట్లుగా మరోసారి ఈ ‘ధ్యాంక్యూ’ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇక ఈ సినిమా కథనంలో ఎలాంటి ఆసక్తికర అంశాలు లేకుండా కేవలం ఒక హీరో తన జీవితంలోని వ్యక్తులను కలిసేందుకు చేసే ప్రయాణమే ఈ థ్యాంక్యూ సినిమాగా మనముందుకు తీసుకొచ్చాడు.

ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరోను ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా ఇంట్రొడ్యూస్ చేసిన విధానం బాగుంది. అయితే అతడికి ఈగో ఎక్కువగా ఉండటం, ఈ క్రమంలో అతడి సక్సెస్‌లో అతడికి ఆర్థికంగా హెల్ప్ చేసి, అతిడి సక్సెస్‌లో భాగమైన ప్రియను కూడా అతడి ఈగో కారణంగా దూరం చేసుకుంటాడు. కట్ చేస్తే.. ఒక ఎమోషనల్ ఘటనతో అతడు తన చుట్టూ ఉండి తన సక్సెస్‌కు కారణమైన వారి విలువను గుర్తిస్తాడు. అతడి జీవితంలోని పలు సందర్భాల్లో అతడికి ఎదురైన కష్టాలు, సుఖాలను గుర్తుకు చేసుకుని బాధపడుతుంటాడు. అయితే చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే హీరో అతడి జీవితంలో అతడికి సహాయపడిన ప్రతిఒక్కరికి థ్యాంక్యూ చెప్పేందుకు ఓ జర్నీ స్టార్ట్ చేస్తాడు.

అటు సెకండాఫ్‌లో అభిరామ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, అతడి కాలేజ్ డేస్ వంటివి చూపెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు దర్శకుడు. క్లైమాక్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూసేలా ఈ సినిమా సెకండాఫ్ చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అనే అంశాన్ని ఏకోసాన కూడా మనకు చూపించకుండా చిత్ర యూనిట్ ప్రేక్షకులతో ఓ చెడుగుడు ఆడుకుంది. ఇక మొత్తానికి ఎలాగోలా క్లైమాక్స్ ఘట్టానికి సినిమా రావడం, శుభం కార్డు పడటంతో హమ్మయ్య అంటూ సదరు ప్రేక్షకుడు థియేటర్ నుండి బయటకు వదిలినందుకు ‘థ్యాంక్యూ’ అంటూ వచ్చేస్తాడు.

ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక హీరో తన జీవితంలోకి మరోసారి తొంగిచూసే కథాంశం మనకు చాలా తెలుగు సినిమాల్లో కనిపించింది. అయితే తన గడిచిన జీవితంలోని ప్రతి వ్యక్తిని కలుసుకునేందుకు హీరో ప్రయాణం చేయడం అనేది మనకు ‘బ్రహ్మోత్సవం పార్ట్-2’లాగా అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి కేవలం ఎమోషనల్ కంటెంట్‌ను కోరుకునే వారు కూడా ఈ సినిమా చూడాలంటే కాస్త ధైర్యం చేసుకుని థియేటర్లకు వెళ్లాల్సిందే అంటున్నారు ఈ సినమా చూసిన విమర్శకులు.

నటీనటులు విశ్లేషణ:
కథనంలో బలం లేనప్పుడు సినిమాలోని నటీనటులు తమ భుజాలపైనే భారం వేసుకుని సినిమాను ముందుక తీసుకెళ్తారు. ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి సీన్ మనకు నాగచైతన్య పర్ఫార్మెన్స్ చూస్తే కనిపిస్తుంది. ఒక్క చైతూ తప్ప ఈ సినిమాలో అలాంటి భాద్యతను మరెవరూ తీసుకోకపోవడం బాధాకరం. తన జీవితంలోని పలు దశల్లో చైతూ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మరోసారి మెప్పించారు. అటు హీరోయిన్ల విషయానికి వస్తే మాళవికా నాయర్ పర్ఫార్మెన్స్ కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక రాశి ఖన్నా గురించి ఈ సినిమాలో చెప్పుకునేందుకు పెద్దగా ఏమీ లేదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది.. అంతే. మిగతా నటీనటులు మనం థియేటర్ బయటకు వచ్చాక మనకు గుర్తుకు కూడా రారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఒక సినిమా హిట్ కావాలంటే, పూర్తి బాధ్యతను దర్శకుడే ఎందుకు తీసుకుంటాడా అనేది మనకు ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. దర్శకుడు రాసుకున్న కథను అతడు ప్రెజెంట్ చేసే విధానం రెండూ కూడా పూర్తిగా అతడి హ్యాండోవర్‌లో ఉంటాయి. అయితే ఈ రెండింటినీ పెద్దగా పట్టించుకోకుండానే సినిమాను తీసి ప్రేక్షకుల మీదకు వదిలాడు విక్రమ్ కుమార్. సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వచ్చే ప్రేక్షకుడికి అదే లేకుండా చేశాడు ఈ డైరెక్టర్. ఈ సినిమా టెక్నీషియన్లలో ఎవరిగురించైనా మాట్లాడుకోవచ్చు అంటే అది ఖచ్చితంగి సినిమాటోగ్రఫర్ పీసీ.శ్రీరాం గురించే. సినిమాను అతడు చూపించిన విధానం బాగుంది. ఇక థమన్ రొట్టకొట్టుడు మ్యూజిక్ కారణంగా ఈ సినిమాలోని పాటలు వచ్చినప్పుడు థియేటర్‌లో కంటే బయటే ఎక్కువగా ఆడియెన్స్ కనిపించారు. నిర్మాతలతో విక్రమ్ కుమార్ బాగానే ఖర్చు పెట్టించాడని చెప్పాలి.

చివరగా:
థ్యాంక్యూ – మరో ‘బ్రహ్మోత్సవం’ అనే చెప్పాలి!

రేటింగ్:
2.25/5.0