రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది.

వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం… హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించడం లేదు. కానీ త్వరలో విశాఖకు రాజధాని తరలిస్తామని మాత్రం జగన్ ప్రభుత్వం లీకులిస్తోంది. ఎప్పటికప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలు మీడియాతో మాట్లాడటం…అదిగో త్వరలోనే విశాఖలో రాజధాని ఏర్పాటు కానుందని, విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతుంది.  అసలు విశాఖకు రాజధాని తరలింపుకు ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని చెప్పుకుంటూ వస్తుంది.

మాటల్లోనే తప్ప చేతల్లో రాజధాని తరలి వెళ్ళడం లేదు…దీని వల్ల అన్నిరకాలుగా వైసీపీకి నష్టం జరిగేలా ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతి చుట్టూ ఉన్న జిల్లాల్లో టీడీపీకి మైలేజ్ పెరుగుతుంది. ఇక అటు కర్నూలు, ఇటు విశాఖలో రాజధాని ఏర్పాటు కాలేదనే అసంతృప్తి..ఆ ప్రాంత ప్రజల్లో ఉంది..దీని వల్ల వైసీపీకే నష్టం జరిగేలా ఉంది. ఒకవేళ త్వరలో విశాఖకు రాజధాని తీసుకెళ్లిన పెద్దగా ఉపయోగం ఉండేలా లేదు.

ఎందుకంటే ఎన్నికలకు దగ్గరపడుతున్న సమయంలో రాజధాని తరలిస్తే అది ఎన్నికల స్టంట్ మాదిరిగానే మిగిలిపోతుంది. దీని వల్ల పెద్దగా ప్రయోజనం కూడా ఉండేలా లేదు. ఓ వైపు ఏమో అమరావతి చుట్టూ పక్కల ఉన్న ప్రజలు వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఎన్నికల సమయానికి రాజధాని తరలింపు సాధ్యం కాకుండా అమరావతిలోనే రాజధాని ఉన్నా సరే…అక్కడ ప్రజలు మళ్ళీ వైసీపీని నమ్మే పరిస్తితి ఉండదు. అంటే ఎటు చూసిన రాజధాని అంశం వైసీపీకి ఇబ్బందయ్యేలా ఉంది.