జ‌గన్…ఎమ్మెల్యేల గోడు ప‌ట్ట‌దా….!

ఏపీలో త‌న పాల‌న బాగుంద‌ని.. త‌న‌ను మించిన విధంగా పాలించిన నాయ‌కుడు లేర‌ని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు.. ఇది మంచిదే. నాయ‌కుడిగా.. ఇలా అనుకోక‌పోతే. ఎవ‌రూ స్థిమితంగా.. ఆ సీఎం సీట్లో కూర్చోలేదు. నిద్ర కూడా పోలేరు. గ‌తంలో పాలించిన రోశ‌య్య నుంచి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల వ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే అనుకున్నారు. నాయ‌కులు క‌దా.. ఇలా అనుకుంటేనే వారికి మ‌నశ్శాంతి కూడా. పైగా.. జ‌గ‌న్‌ది ప్రాంతీయ పార్టీ.. అధిష్టానం.. అధినేత‌.. అన్నీ ఆయ‌నే!

ఎవ‌రూ ఫిర్యాదు చేసే వారు.. ఎవ‌రూ.. ఆయ‌న‌కు వేలు పెట్టి చూపించే వారు లేరు. ఇదే.. జ‌గ‌న్‌కు ఇప్పు డున్న పెద్ద బ‌లం. ఆయ‌న ఏం చేసినా.. అడిగేవారు… లేరు. ఆయ‌న‌ను కాద‌ని అడుగులు వేసేవారు కూడా లేరు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతున్న జ‌రిగిన ప్ర‌స్థానం ఇదే! కానీ.. ఒక్క సారి తెర‌దీసి చూస్తే.. అన్న‌య్య స‌న్నిధి .. అదే మాకు పెన్నిధి.. అంటూ.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాగం తీసిన‌.. ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇటీవ‌ల‌.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే… ఒక కార్య‌క్ర‌మానికివ‌చ్చారు. ఆయ‌న రావ‌డం .. ఓ ప‌దినిముషాలు ఆల‌స్యం అయ్యేసరికి.. స‌భ‌లో కుర్చీల‌న్నీ ఖాళీల‌య్యాయి. దీనికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే.. వ‌లంటీర్లు ఇంటి వ‌స్తారు.. మాకు రేష‌న్ ఇస్తారు.. వ‌లంటీర్లు ఇంటికి వ‌స్తారు.. మాకు డ‌బ్బులు ఇస్తారు.. అంటూ.. స‌భ‌కు వ‌చ్చిన వారు వెనుదిరిగారు. దీంతో ఎమ్మెల్యేగారు ప‌నిని సాధ్యమైనంత వేగంగా ముగించుకుని.. వెళ్లిపోయారు.

ఈ ప‌రిస్థితి ఈ ఒక్క జిల్లాలోనే కాదు.. విశాఖ జిల్లా చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నిపించింది. అక్క‌డ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఏమైనా ఉన్నాయా? అని ఎమ్మెల్యే ఇటీవ‌ల ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌శ్నించ‌గా.. అన్నీవ‌లంటీర్‌కు చేప్పేశాం! అంటూ.. జ‌నాల నుంచి రియాక్ష‌న్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న ఒకింత హ‌ర్ట్ అయ్యారు కూడా. దీనిని బ‌ట్టి.. అస‌లు వ‌లంటీర్ల‌కు ఉన్న విలువ‌.. వారికి ప్ర‌జ‌ల నుంచి ద‌క్కుతున్న గౌర‌వంలో.. త‌మ‌కు క‌నీసం కూడా ద‌క్క‌డం లేద‌ని.. అంటున్నారు .

రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. వ‌లంటీర్ల‌ను నిల‌బెట్టినా.. నిల‌బెట్టే ఛాన్స్ ఉంద‌ని.. వారు గుస‌గుసలాడుతున్నారు. ఇది.. పార్టీకి.. నాయ‌క‌త్వానికి కూడా అంత మంచిది కాద‌ని.. ఎమ్మెల్యేల‌కు త‌గిన గౌర‌వం ఉండేలా చూడాల‌ని కోరుతున్నారు.