తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ఈ షో ప్రారంభం కాగా.. సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి, శ్రీరామ్‌లు టాప్ 5కి చేరుకున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో తెలిసిపోనుండగా.. నేటి సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభమైంది.
అయితే ఈ ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న స్టేజ్ మీదికి రాగానే.. హోస్ట్ నాగార్జున ముందు ఒకటే ప్రశ్న అడిగాడు. `రాజమౌళి గారు.. మీ పేరులో ముందు ఉన్న ఎస్ఎస్ అంటే అర్థం ఏంటీ..?` అంటూ నాగ్ ప్రశ్నించాడు. దీంతో రాజమౌళి ఎస్ఎస్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో రివిల్ చేసేశాడు.
రాజమౌళి మాట్లాడుతూ.. నిజానికి ఎస్ఎస్ అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అంతే. కానీ.. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మాత్రం సక్సెస్, స్టుపిడ్ అంటారు. దీంతో సక్సెస్ ఓకే కానీ.. స్టుపిడ్ అనే విషయం మాత్రం నేను ఒప్పుకోను అంటూ నాగార్జున నవ్వేస్తారు. మొత్తానికి వీరి సంభాషణ మాత్రం సూపర్ ఫన్నీగా కొనసాగింది.
కాగా, రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతోంది.