బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో అట్టహాసంగా సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ షో గత 105 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను అద్భుతంగా ఎంటర్‌టైన్ చేసింది. అయితే నిన్నటితో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
మోస్ట్ ఎంటర్‌టైనర్ వీజే సన్నీ బిగ్‌బాస్ విజేతగా అవతరించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో శ్రీరామ్, మానస్, సిరిలు నిలిచి ఎలిమినేట్ అయ్యారు. ఇక విన్నర్‌గా నిలిచిన సన్నీకి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ అందించారు.
అంతే కాదు, సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు టీవీఎస్ బైక్‌ను సైతం సన్నీ దక్కించుకున్నాడు. దీంతో సంతోషం పట్టలేకపోయిన సన్నీ.. అమ్మ అడిగిన మొట్టమొదటి బహుమతి బిగ్‌బాస్ ట్రోఫీ అంటూ దాన్ని ఆమె చేతుల్లో పెట్టి సంతృప్తి చెందాడు.
అలాగే నన్ను గెలిపించిన ఆడియన్స్‌ను ఎప్పటికీ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటానని మాటిచ్చిన సన్నీ.. మనమెంత కొట్టుకున్నా సరే హౌస్‌మేట్స్ అందరం కలిసే ఉందామని చెప్పుకొచ్చారు. ఇక సన్నీ గెలవడంతో.. అతడి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.