చంద్రబాబు.. అదే అరిగిపోయిన రికార్డు

చంద్రబాబు నాయుడు.. సీనియర్ పొలిటీషియన్.. దేశంలో ఉన్న సూపర్ సీనియర్ నాయకుల్లో ఈయనా ఒకరు.. అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన నాయకుడు.. అయితే అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు నాయుడికి ఏమీ పాలుపోతున్నట్లు లేదు.. ఎప్పుడూ అదే అరిగిపోయిన రికార్డు వేస్తూ జనాలను, కార్యకర్తల ఓపికకు సహనాన్ని పెడుతుంటారు. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నా.. ఎన్నో చూశా.. నన్ను వీళ్లేమి చేస్తారు.. ఎన్ని కేసులు పెట్టలేదు.. ఒక్క దానిని కూడా నిరూపించలేకపోయారు.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను..అని చెప్పిందే చెప్పి..మళ్లీ చెప్పి..తిప్పి తిప్పి చెప్పి.. చివరకు అక్కడికే వస్తాడు. అదే చంద్రబాబంటే.. ఎప్పుడు.. ఎక్కడ ఏ రాజకీయ సమావేశం జరిగినా.. ప్రజలతో మాట్లాడినా ఇవే మాటలు. అరె.. ఎన్నిసార్లు చెబుతావన్నా అని కిందిస్థాయి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అన్నకు వయసైంది కదా.. చెప్పించే చెబుతాడులే తమ్ముళ్లూ.. అని సీనియర్ నాయకులు కార్యకర్తలు, అనుచరులను సముదాయిస్తుంటారు.

చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసి వర్షాలకు తిరుపతి అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీంతో బాధ్యతగ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధితులను పరామర్శించాలనుకున్నాడు. తప్పులేదు.. పరామర్శించాలి కూడా.. అయితే ఆ పరామర్శలో కూడా సర్కారు పై విమర్శలు.. అసలు బాధితులకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా సహాయం కావాలా? లేక పార్టీ నుంచి సహకరించాలా అనేది చెప్పకుండా వరదలకు కారణం ప్రభుత్వమే అని బుధవారం పేర్కొన్నారు. అరె.. ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లే కదా అయింది.. మరి ఇంతకుముందు ఉన్నది మీరే కదా అని ప్రజలు గుసగుసలాడారు. అయినా.. అవేమీ ఈయనకు గుర్తున్నట్లు లేవని ప్రజలు నవ్వుకున్నారు. అయినా బాధితుల వద్ద తన బాధలు చెబితే ఎలా? అలిపిరిలో బాంబు పేల్చారు.. అయినా భయపడలేదు.. ఇప్పుడు కుటుంబంపైకి వచ్చారు.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని పేర్కొన్నారు. వచ్చింది పరామర్శించడానికా.. లేక ఎన్నికల ప్రచారానికా అని తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోయారు. ఇలా ఉంటుంది సీనియర్ నాయకుడి ప్రసంగం.