ఏపీ రాజ‌కీయాలు ఇలానే ఉంటే ఎవ‌రికి లాభం..?

రాష్ట్ర రాజ‌కీయాలు ఏక‌ప‌క్షం అవుతున్నాయా? రాష్ట్రంలో టీడీపీ కేంద్రంగా రాజ‌కీయం మారిపోతోందా? విప‌క్షాలను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డంలేదా? దేశంలో అతి పెద్ద, అతి సీనియ‌ర్ జాతీయ రాజ‌కీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామ‌రూపాలు లేకుండా పోతోందా? ముఖ్యంగా ద‌క్షిణాదిలో కాంగ్రెస్ కుకంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీ నిలువ‌నీడ కోల్పోయి అలో ల‌క్ష్మ‌ణా అంటోందా? ఏపీ ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న జ‌గ‌న్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైందా? అంటే.. తాజా రెండు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఔన‌నే స‌మాధాన మిస్తున్నాయి. రాష్ట్ర రాజ‌కీయాలు ఏక‌ప‌క్షంగా మారుతున్నాయ‌ని ఈ విశ్లేష‌ణ‌లు ఉద్ఘాటిస్తున్నాయి.

అయితే, ఈ ప‌రిణామం ఎవ‌రికి లాభం? ప‌్ర‌జ‌ల‌కా? పార్టీల‌కా? చూద్దాం… ఏపీలో ప్ర‌ధాన అధికార ప‌క్షం టీడీపీ, ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ ఉన్నాయి. ఇక‌, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు కూడా కేడ‌ర్ ప‌రంగా బాగానే ఉన్నాయి. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన నంద్యా ల ఉప ఎన్నిక‌, తాజాగా జ‌రిగిన కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు చెప్పిన‌ట్టు స్ప‌ష్ట‌మైంది. నంద్యాల‌లో జ‌రిగిన తీవ్ర ఉత్కంఠ పోరులో టీడీపీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. ఎన్నో ఆశ‌ల‌తో జ‌గ‌న్ చేసిన ప్ర‌చారం ఆయ‌న నోటితీట కార‌ణంగా కొట్టుకు పోయింది. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ గెలుపు గుర్రాన్ని ఎక్కేసింది.

ఇక‌, కాకినాడ‌లోనూ టీడీపీ హ‌వా కొన‌సాగింది. ఇక్క‌డ నిజానికి కాపు ఉద్య‌మం, ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త బ‌య‌ట‌ప‌డాలి. కానీ వీటిని ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ ముందుకు తీసుకువెళ్ల‌లేక‌పోయింది. దీనికితోడు కాకినాడ కార్పొరేష‌న్ బాధ్య‌త‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న మిత్రుడు, ఎంపీ విజ‌య‌సాయికి అప్ప‌గించారు. ఈయ‌న రాజ‌కీయాల‌కు కొత్త‌కావ‌డం, కాకినాడ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ఆయ‌న యంత్రాంగాన్ని సిద్ధం చేయ‌క‌పోవడం వంటి కార‌ణాల‌తో వైసీపీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది.

ఇలా ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తే.. నష్ట‌పోయేది వారేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షాల‌కు కూడా ప్ర‌జ‌లు అవకాశం ఇవ్వాల‌ని లేనిప‌క్షంలో అధికార ప‌క్షం ఇష్టారాజ్యానికి అంతుండ‌ద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు అంటున్నారు. దీంతో పూర్తిగా న‌ష్ట‌పోయేది ప్ర‌జ‌లేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏది ఏమైనా.. ప్ర‌జ‌లు ప్ర‌స్తుతానికి ఇచ్చిన తీర్పును గౌర‌వించాల్సిందే క‌దా!!