బాల‌య్య చ‌ర్చ‌లు…ఆ పార్టీ ఏపీ టీడీపీలో విలీనం..!

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు మాంచి జోష్‌లో ఉంది. నిద్రాణంగా ఉన్న టీడీపీ వాళ్ల‌ను, టీడీపీ అభిమానుల‌ను జ‌గ‌న్ రెచ్చ‌గొట్టి మ‌రీ నంద్యాల ఉప ఎన్నిక‌తో ఫామ్‌లోకి తీసుకువ‌చ్చాడు. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు టీడీపీ సైనికులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో ఓ విధ‌మైన నిస్తేజం నెల‌కొంది. ఎప్పుడైతే జ‌గ‌న్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సంప్ర‌దాయానికి విరుద్ధంగా త‌మ పార్టీ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌డంతో పాటు టీడీపీ నుంచి వ‌చ్చిన శిల్పా మోహ‌న్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌డం, తాను సీఎం అభ్య‌ర్థి హోదాలో ఉండి కూడా అక్క‌డ చిన్న ఎన్నిక కోసం 15 రోజులు మ‌కాం వేయ‌డంతో టీడీపీ వైళ్లు ఒక్క‌సారిగా నిద్రాణ స్థితి నుంచి మేల్కొని స‌త్తా ఏంటో చాటారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పాటు ఆ వెంట‌నే జ‌రిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో కూడా తిరుగులేని భారీ మోజార్టీతో విజ‌యం సాధించింది. ఈ రెండు విజ‌యాల జోష్‌తో టీడీపీ ఇప్పుడు మ‌రిన్ని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ రెండు విజ‌యాలు 2019 ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డంలో టీడీపీకి చాలా ప్ల‌స్ కానున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ జోష్ చూసిన ఓ సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ కం రాజ‌కీయ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఇప్పుడు త‌న పార్టీని ఏపీ టీడీపీలో విలీనం చేసేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో టీడీపీలో ఉన్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆ త‌ర్వాత ప్ర‌త్యేక రాయ‌ల‌సీమ వాదంతో రాయ‌ల‌సీమ ప‌రిక్ష‌ణ స‌మితి పార్టీ స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీ ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఆయ‌న త‌న పార్టీ అభ్య‌ర్థిగా బ‌న‌వాసి పుల్ల‌య్య‌ను నిల‌బెట్టి స్వ‌యంగా ప్ర‌చారం చేశారు. అయితే చాలా నిరాశాజ‌న‌కంగా ఆ పార్టీకి కేవ‌లం 154 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో షాక్‌కు గురైన ఆయ‌న ఇక టీడీపీకే ఏపీలో భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని డిసైడ్ అయ్యి, ఇప్పుడు త‌న ఆర్పీఎస్ పార్టీని టీడీపీలో విలీనం చేయ‌డంతో పాటు తాను కూడా టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌.

టీడీపీలో ఉండ‌గా మంచి భ‌విష్య‌త్తు:

కాంగ్రెస్ నుంచి 1993లో టీడీపీలో చేరిన బైరెడ్డి టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 1994, 1999 రెండు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచి 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి గౌరు చరిత చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్వి భజనలో భాగంగా నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. దీంతో ఆయన పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వర్గాల్లోను అనుచ‌రులు ఉన్నారు.

2013లో తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న టైంలో ఆయ‌న రాయలసీమ కావాలంటూ టీడీపీని వీడి రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. ప్రత్యేక రాయలసీమ జెండాను చేత పట్టుకొని రాయలసీమ ఉద్యమానికి ఊపిరి పోశారు. బస్సుయాత్ర ద్వారా రాయలసీమ జిల్లాలు తిరిగారు. ప్రత్యేక రాయల సీమ వాదాన్ని వినిపిస్తూ వచ్చారు.

బాల‌య్య‌తో చ‌ర్చ‌లు:

నంద్యాల ఉప ఎన్నిక దెబ్బ‌తో ఆయ‌న‌ టీడీపీతోనే భ‌విష్య‌త్తు ఉంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. దీంతో బైరెడ్డి టీడీపీలో చేర‌డంతో పాటు త‌న ఆర్పీఎస్‌ను టీడీపీలో విలీనం చేసే విష‌య‌మై చ‌ర్చించేందుకు ఆయ‌న సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ను క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. మంత్రులు పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే బైరెడ్డి టీడీపీలో చేర‌డంతో పాటు ఆయ‌న ఆర్పీఎస్ ఏపీ టీడీపీలో విలీనం కానుందని టాక్‌?