వైసీపీకి మంచి జోష్..ఒకేసారి న‌లుగురు మాజీ మంత్రులు!

ఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్న‌ట్టు కూడా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని టీడీపీ మంత్రులు కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహ‌సం ఎవ‌రైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజ‌కీయాల్లో అవ‌కాశం కోసం కాచుకుని కూర్చొనే వాళ్లు చాలా మందే ఉంటారు. అంద‌రూ అధికార పార్టీలోకి వెళ్లిపోతే అక్క‌డ మాత్రం ఎక్క‌డ నుంచి ప‌ద‌వులు వ‌స్తాయి..తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో ఇప్ప‌టికే ఓవ‌ర్‌లోడ్ ఎలా అయ్యిందో చూశాం..ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి జంప్ చేసేస్తే ఇక్క‌డ కూడా అంతే ఓవ‌ర్‌లోడ్‌తో టీడీపీ బండి బర‌స్ట్ అయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు.

వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం…విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చందంగా ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. టీడీపీలోకి జంప్ చేసేందుకు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున క్యూ క‌డుతున్నారంటే వైసీపీ ఎంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న వైసీపీకి మాంచి జోష్ ఇచ్చే వార్త వ‌చ్చేసింది. వైసీపీలోకి ఏకంగా ఒకేసారి న‌లుగురు మాజీ మంత్రులు చేరేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ న‌లుగురు మాజీ మంత్రులు కాంగ్రెస్ హ‌యాంలో ఓ వెలుగు వెలిగి ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో స్త‌బ్దుగా ఉన్నారు.

ఈ న‌లుగురు మాజీ మంత్రుల్లో ఇద్ద‌రు కేంద్ర మాజీ మంత్రులు అయితే మ‌రో ఇద్ద‌రు రాష్ట్ర మాజీ మంత్రులు కావ‌డం విశేషం. ఇద్ద‌రు మాజీ కేంద్ర మంత్రుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణితో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి ఉన్నారు. వీరిలో కిల్లి కృపారాణి టెక్క‌లి లేదా ప‌లాస టిక్కెట్ అడుగుతున్నా ఆమెకు ప‌లాస టిక్కెట్ ఇచ్చేందుకే జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి ఫ్యామిలీకి క‌ర్నూలులో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డం దాదాపు ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు క‌ర్నూలు ఎంపీ సీటు ఇవ్వ‌డం ఖాయం కావ‌డంతో అక్క‌డ వైసీపీ సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక‌ను జ‌గ‌న్ పెట్టేశార‌ని తెలుస్తోంది. ఇక కోట్ల త‌న‌యుడికి జిల్లాలో వారు కోరుకున్న లేదా వీలును బ‌ట్టి ఏదో ఒక అసెంబ్లీ సీటు కూడా ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇద్ద‌రు స్టేట్ మాజీ మంత్రులు కూడా…..

ఇక ఇదే కోవ‌లో ఇద్ద‌రు స్టేట్ మాజీ మంత్రులు అయిన వ‌ట్టి వ‌సంత్‌కుమార్‌, మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని తెలుస్తోంది. వీరిలో మ‌హీధ‌ర్‌రెడ్డి ప్ర‌కాశం జిల్లా కందుకూరుకు చెందిన వారు. అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు టీడీపీలో చేరిపోయారు. దీంతో మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీలో చేరి అక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్‌కుమార్‌ను వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైసీపీకి ఇంట‌ర్న‌ల్‌గా హెల్ఫ్ చేస్తోన్న ఓ ఎంపీ తెర‌వెన‌క మంత్రాంగం న‌డుపుతున్నార‌ని జిల్లాలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వ‌సంత్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉంగుటూరు సీటు ఇస్తార‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న వైసీపీలో ఒకేసారి న‌లుగురు మాజీ మంత్రులు చేర‌డం అంటే ఆ పార్టీకి మంచి జోష్ లాంటిదే.