ఆ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వ‌స్తే టీఆర్ఎస్‌కు అగ్నిప‌రీక్షే

ఇప్పుడు తెలంగాణ‌లో ఈ కామెంట్లే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వ‌స్తే.. అధికార పార్టీ ఇరుకున ప‌డ‌డం ఖాయం అనే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి కార‌ణం ఏంటో? ఉప ఎన్నిక ఎందుకు వ‌స్తుందో చూద్దాం… కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత‌, సికింద్రాబాద్ ఎంపీ ‘బండారు దత్తాత్రేయ’ను పదవి నుంచి తొలగించిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాల‌ను శిర‌సా వ‌హిస్తూ.. ఆయ‌న వెంట‌నే రాజీనామా స‌మ‌ర్పించేశారు. వాస్తవానికి దత్త‌న్న‌ను ఇంత తొందరగా తొలగిస్తారని ఎవ‌రూ ఊహించ‌లేదు.

ఇక‌, ఇప్పుడుద‌త్త‌న్న గురించి మ‌రో సంచ‌ల‌న వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన ద‌త్త‌న్న‌.. త్వ‌ర‌లోనే లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు. బీజేపీ అధిష్టానం త్వ‌ర‌లోనే ఆయనకు గవర్నర్‌ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయి ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే.. ఉపఎన్నికలు రావ‌డం ఖాయం. ఈ ఉపఎన్నికలు వస్తే ఎవరి పరిస్థితి ఏమిటో? ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

నిజానికి తెలంగాణ‌లో గత మూడున్నరేళ్ల నుంచి ఎలాంటి ఎన్నిక‌లూ జ‌ర‌గ‌లేదు. దీంతో అధికార పార్టీపై ప్ర‌జ‌ల నాడి ఎలా ఉందో తెలియ‌డం లేదు. పైకి అంతా బాగానే ఉన్న‌ట్టుగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం కేసీఆర్‌, ఆయ‌న టీంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని అంటున్నాయి విప‌క్షాలు. ఈ విష‌యం తాజా ఉప పోరుతో తేలిపోతుంద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీపడగా బీజేపీ గెలిచింది. ఇక‌, ఇప్పుడు ఉపఎన్నిక వస్తే బీజేపీకి మళ్లీ గెలిచే ఛాన్స్‌ ఉన్నా లేకున్నా.. అధికార టీఆర్‌ఎస్‌ గెలవడం మాత్రం కష్టమేనంటున్నారు.

ఎందుకంటే గత మూడున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో నగర ప్రజలు నరకం చవిచూస్తున్నారు. పూర్తికానీ మెట్రోరైలు, ఇంకా మొదలు కానీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, గుంతలు పడిన రోడ్లు వెరసి అభివృద్ధికి ఆమడ దూరంలో నగరం ఉండడం అధికారపార్టీపై ప్ర‌జ‌ల్లో పీక‌ల్లోతు ఆగ్ర‌హం ఉంది. అదేస‌మ‌యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఊరించిన కేసీఆర్‌ ఇప్పుడు ఉద్యోగాల ఊసెత్తకపోవడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో అధికార పార్టీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్ ఉప ఎన్నిక వ‌స్తే.. అధికార పార్టీ ప‌రిస్థితి ఏంటో ఇట్టే అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.