వ్యూహ‌క‌ర్త‌ల‌కు ఏపీలో ప్లేస్ లేదా?

వైసీపీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. అన‌గానే ముందుగా ఏపీ ప్ర‌జ‌లంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక్క‌డ ప్ర‌శాంత్ కిషోర్‌ని నియ‌మించుకున్నందుకు కాదు.. వ్యూహ‌క‌ర్త అనే కొత్త మాట విని అవాక్క‌య్యారు. నిజ‌మే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇటువంటి ప‌దాన్ని విన‌లేదు ఏపీ ప్ర‌జ‌లు! ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి సీనియ‌ర్ నాయ‌కుల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని వ్యూహాలు ఉంటే.. కొత్త‌గా వీట‌న్నింటినీ అమ‌లు చేయ‌డానికి వేరే ప్రాంతంపు వ్య‌క్తి ఎందుకో అని స‌న్నాయినొక్కులు కూడా నొక్కిన వాళ్లు లేక‌పోలేదు. అయితే ఇప్పుడు ఈ పీకేల వ‌ల్ల ఏపీలో ఎలాంటి లాభం లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు తెలిసొస్తుందో లేదోన‌ని పార్టీ నేత‌ల‌తో పాటు విశ్లేష‌కులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఉత్త‌రాది ఓటర్ల‌కు, ద‌క్షిణాది ఓట‌ర్ల‌కు కొంత వ్య‌త్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో వివిధ ప్రాంతా ల‌ను అనుగుణంగా వ్యూహ‌లు ర‌చించుకుంటూ వెళ్లాలి. ఒక‌చోట స‌క్సెస్ అయితే మ‌రోచోట అట్ట‌ర్ ప్లాప్ అవ‌డం ఖాయం! అందులోనూ ప్రాంతీయ పార్టీల హ‌వా న‌డిచే ద‌క్షిణాదిలో.. అందులోనూ ఏపీ రాజ‌కీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిపై పూర్తి అవ‌గాహ‌న లేకుండా ర‌చించే వ్యూహాలు పూర్తిగా బెడిసికొడ‌తాయి. దీనికి ఉదాహ‌ర‌ణే నంద్యాల ఉప ఎన్నిక‌. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తగా ఉత్త‌రాదిలో పేరున్న ప్ర‌శాంత్ కిషోర్‌ను ద‌క్షిణాదికి తీసుకొచ్చి.. ప‌క్క‌నే పెట్టుకు న్నారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.

పీకే వ్యూహ‌క‌ర్తగా వ‌చ్చిన త‌ర్వాత నంద్యాల ఉప ఎన్నిక‌ల రావ‌డంతో అంతా ఆయ‌న ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేస్తార‌ని ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఎన్నికల ప్రచారంలో జగ‌న్‌ చాలా దూకుడు ప్రదర్శించారు. హామీలు నెరవేర్చ నందుకు సీఎంని నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పు లేదన్నారు. ప్రజల్ని మోసం చేసినందుకు ఊరి తీయాలన్నారు…. ఇలాంటి కఠినమైన పదజాలం జగన్‌ గతంలో వాడిన దాఖలాలు లేవు. కానీ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించు కున్నాక బహిరంగ వేదికలపై ఇలాంటి మాటలు వాడటం వెనుక ఎవరి ప్రమేయం ఉందన్నది అసలు ప్రశ్నగా మారింది. ఒక పార్టీని ., వ్యక్తిని అంచనా వేసేపుడు ఆయన వాడే మాటలు కూడా ఓటర్లు గుర్తుంచుకుంటారు.

ఎన్నికల ప్రచారంలో జగన్‌ వాడిన మాటలు జగన్ తప్పా., అతని వ్యూహకర్త తప్పా అన్నది వారే తేల్చుకోవాలని బీజేపీ సీనియర్‌ నాయకుడు యడ్లపాటి రఘుబాబు అభిప్రాయ‌ప‌డ్డారు. జగన్‌ ఓటమికి అతని వ్యూహకర్తలే బాధ్యత వహిం చాల్సి ఉంటుందన్నారు. ఇక ఏపీలో వ్యూహకర్తలకు అవకాశం లేదని టీడీపీ అధికార ప్రతినిధి సాయి అన్నారు. పీకేకు ఏపీ రాజకీయాలు ఏమి తెలుసని.,వైసీపీ ప్లీనరీలో చెప్పకుండా నంద్యాలను జిల్లాగా చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పారన్నారు. ప్లీనరీలో లేని హామీలు ఎన్నికల ప్రచారంలో చేయడం తప్పే., వారి తప్పులే టీడీపీకి కలిసొ చ్చాయని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఎన్నిక‌ల వ‌ల్ల సుస్ప‌ష్టంగా తెలిసింది.. వ్యూహ‌క‌ర్త‌ల‌కు ఏపీలో మ‌నుగడ లేదు!