శిల్పా బ్ర‌ద‌ర్స్ సాధించిందేంటి

నంద్యాల ఉప ఎన్నిక శిల్పా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేసిందా? వీరిని రాజ‌కీయంగా నామ‌రూపాలు లేకుండా చేసిందా? ఉన్న ప‌ద‌వుల‌ను ఒదులుకుని వ‌స్తాయ‌నుకున్న ప‌ద‌వి రాక‌.. రెంటికీ చెడ్డ రేవ‌డిలా అన్న‌ద‌మ్ములు ఇంటి ముఖం ప‌ట్టారా? అంటే ఔన‌నే అంటోంది నంద్యాల ఉప ఎన్నిక‌. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల జాత‌కాల‌ను మార్చేసిన ఈ ఉప ఎన్నిక‌.. వీరి భ‌విష్య‌త్తు అంధ‌కారం అయ్యేలా చేసేసింది.

ఖ‌చ్చితంగా న‌ల‌భై రోజుల కింద‌ట‌.. నంద్యాల వీధుల్లో రాజాల్లా త‌లెత్తుకు తిరిగిన శిల్పా మోహ‌న్‌రెడ్డి, శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డిలు ఇప్పుడు రోడ్ల మీద‌కు వ‌చ్చేందుకు కూడా సిగ్గుప‌డిపోతున్నారు. దీనంత‌టికీ స్వయంకృత‌మే కార‌ణ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. క‌ర్నూలు జిల్లా టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి. . నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున టికెట్‌ను ఆశించారు. అయితే, 2014లో ఈయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన చ‌రిత్ర ఉన్న నేప‌థ్యంలో మ‌రోసారి అక్క‌డ ఇంట‌ర్న‌ల్‌గా ప్ర‌జాభిప్రాయం తెలుసుకుని నిర్ణ‌యం తీసుకుంటాన‌ని బాబు చెప్పారు.

ఇంత‌లో మంత్రి భూమా అఖిల ప్రియ.. త‌మ తండ్రి సీటును త‌న కుటుంబానికే కేటాయించాల‌నే డిమాండ్‌ను లేవ‌నెత్తింది. ఈ క్ర‌మంలోనే సోద‌రుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని తెర‌మీద‌కి తెచ్చింది. దీంతో శిల్పా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయారు. త‌న‌కు బాబు హ్యాండిస్తారేమో? అని అనుకున్నారు. పోనీ.. ఇదే విష‌యాన్ని బాబు ద‌గ్గ‌ర క‌న్‌ఫ‌ర్మ్ చేసుకుని ఉంటే బాగుండేది. కానీ, అఖిల ప్ర‌క‌ట‌నే ఫైన‌ల్ అనుకున్న‌ట్టుగా ఆయ‌న నేరుగా హైద‌రాబాద్ వ‌చ్చేసి.. జ‌గ‌న్ గూటిలో చేరిపోయారు. దీంతో జ‌గ‌న్ కూడా ఆయ‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసేశారు.

ఇక‌, బాబు ద‌గ్గ‌ర ఈ టికెట్ పేచీ లేక‌పోయేస‌రికి నేరుగా బ్ర‌హ్మానంద‌రెడ్డికే టికెట్ కేటాయించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఎమ్మెల్సీగా రెండు నెల‌ల కింద‌టే ప్ర‌మాణం చేసిన శిల్పా మోహ‌న‌రెడ్డి సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి.. అన్న‌వేరు రాజ‌కీయాలు వేరు అని ప్ర‌క‌టించారు. అయితే, ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, ఇంత‌లోనే మ‌న‌సు మార్చుకుని నంద్యాల‌లో జ‌ర‌గిన బ‌హిరంగ వేదిక సాక్షిగా త‌న ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కేవ‌లం ఎమ్మెల్యే సీటు కోసం బాబుతో విభేదించి తొడ‌లు కొట్టారు. కానీ, నిన్న‌టి ఫ‌లితం జ‌గ‌న్‌కి రివ‌ర్స్ అయింది. దీంతో ఇప్పుడు అన్న‌ద‌మ్ముల ప‌రిస్థితి కేరాఫ్ లేకుండా పోయింది. దీంతో వీరు బాబుపై యుద్ధం చేసి సాధించింది ఏమిట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.