నంద్యాలలో టీడీపీ గెలుపుపై మోడీ ట్వీట్‌లో మెలిక ఏంటి

నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రాన్నే కాకుండా దేశం మొత్తాన్ని ఆక‌ర్షించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో అనివార్య‌మైన ఈ ఉప పోరుకు సంబంధించి జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున ప్ర‌చారం చేసింది. ముఖ్యంగా చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన వివాదాస్ప‌ద కామెంట్లు నేష‌నల్ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. దేశానికి రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానులుగా చేసిన వారిని ఎన్నుకున్న ఈ నంద్యాల ప్ర‌జ‌ల‌పై అనేక క‌థ‌నాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. దీంతో ఈ ఉప ఎన్నిక అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

ఇక‌, ఇక్క‌డి ఉప పోరులో టీడీపీ ఒంట‌రి యుద్ధ‌మే చేసింది. 2014లో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. బీజేపీని ఆహ్వానించ‌లేదు. ప‌వ‌న్ త‌న‌కు తానుగానే త‌ట‌స్థం అని ప్ర‌క‌టించేసుకున్నాడు. దీంతో ఇక్క‌డ ఎవ‌రి సాయ‌మూ లేకుండా అభివృద్ధి నినాదంతో అడుగులు వేశారు. గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఒక్క‌సారిగా ఢిల్లీ చూపు బాబుపై ప‌డింది. త‌న పాల‌న‌లో మైలురాళ్ల‌ను అధిగ‌మిస్తూ.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతూ.. బాబు ఒంట‌రిగా బ‌రిలో దిగి స‌త్తాచాట‌డం ఢిల్లీలోని బీజేపీ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురి చేసింది.

ఇక‌, ఈ గెలుపుపై స్పందించిన ప్ర‌ధాని మోడీ.. త‌న ట్విట్ట‌ర్‌లో అభినంద‌న‌లు తెలిపారు. అయితే, ఆయ‌న నేరుగా ఎక్క‌డా చంద్ర‌బాబు పేరును తెలుప‌కుండా అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి పేరును పేర్కొంటూ మా మంచి మిత్రుడు అంటూ బాబును స్మ‌రించారే త‌ప్ప ఎక్క‌డా ఆయ‌న పేరును పేర్కొన‌లేదు. ఇటీవ‌ల ఇదే విష‌యాన్ని మీడియా చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ల‌గా.. బాబు ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, బాబు పేరును మోడీ కావాల‌నే ప్ర‌స్తావించ‌కుండా శుభాకాంక్ష‌లు చెప్పారా? లేక మ‌రేదైనా వ్యూహం ఉందా? ఇప్పుడు ఇదే ఆలోచ‌న అమ‌రావ‌తిలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి మోడీ వ్యూహం ఏంటో తెలియాలంటే ఓపిక ప‌ట్టాల్సిందే.