నంద్యాల‌లో వైసీపీ ఓట‌మి వెన‌క కొత్త‌కోణం

నిజ‌మేనా? ఈ వ్యాఖ్య‌లు స‌రైన‌వేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది నంద్యాల‌లో స్థానికంగా ఉంది రాజ‌కీయ, ఎన్నిక‌ల స‌ర‌ళిని ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌రిశీలించిన విశ్లేష‌కుల‌కు!! జ‌గ‌న్ టీంలోనే ఉండి జ‌గ‌న్‌కు గోతులు తీసిన వాళ్లు ఉన్నార‌ని వీరు ఖ‌చ్చితంగా చెబుతున్నారు. అనేక మంది శ‌ల్య సార‌థ్యం చేశార‌ని కూడా చెబుతున్నారు. నంద్యాల‌లో గెల‌వక ముందే చాలా అహంభావంతో ఉన్నాడ‌ని, ఇక్క‌డ గెలిస్తే.. అస్స‌లు ప‌ట్టుకోలేమ‌ని, మ‌న‌ల్ని కూడా ఎద‌గ‌నివ్వ‌డని ప‌లువురు సొంత పార్టీ నేత‌లు, కుటుంబంలోని వ్య‌క్తులే జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా తెర‌వెనుక చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది.

ఫ‌లితంగా నంద్యాల‌లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకోవాల్సిన దుస్థితి వ‌చ్చింద‌ని వారు అంటున్నారు. ఈ జాబితాలో జ‌గ‌న్ సొంత బాబాయి వివేకానంద రెడ్డి ఉన్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేద‌ని కూడా చెబుతున్నారు. పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. నిశ్శ‌బ్దంగా ఉన్న, జ‌గ‌నే మా నాయ‌కుడు అన్న నేత‌ల‌ను ఇందుకు వారు ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గానే ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గానూ… ఆత్మ‌విశ్వాసంతోనూ.. వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలిస్తే.. త‌మ‌కు మ‌రింత క‌ష్ట‌మ‌వుతుంద‌నీ.. ఆయ‌న్ను అదుపులో ఉంచ‌డం అసాధ్య‌మ‌వుతుంద‌నీ వారు భావించార‌నీ.. అందుకే ఉడ‌తా భ‌క్తిగా టీడీపీ అభ్య‌ర్థికి త‌మ శ్రేణులు నంద్యాల‌లో ఓటేసేలా ప్రోత్స‌హించార‌నీ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇలా తెర‌వెనుక గోతులు తీసిన వారిలో ఎంపీ స్థాయి నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేల వ‌ర‌కు ఉన్నార‌ని తెలుస్తోంది.

జ‌గ‌న్ చుట్టూ ఉన్న అనేక మంది స్వార్థ‌ప‌రులు త‌మ ప‌బ్బం గ‌డుపుకొనేందుకు ఇస్తున్న స‌ల‌హాలు మొద‌టికే మోసం తెస్తున్నాయ‌ని అంటున్నారు. బాబు రెచ్చ‌గొడుతుంటే.. జ‌గ‌న్ మ‌రింత రెచ్చిపోవ‌డం వెనుక ఇలాంటి వారి స‌ల‌హాలు బాగా ప‌నిచేస్తున్నాయ‌ని చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ చేస్తున్న అనాలోచిత వ్యాఖ్య‌లు టీడీపీకి ప్ల‌స్సుల‌మీద ప్ల‌స్సులు అయిపోతున్నాయ‌ని అంటున్నారు. టీడీపీ వ్యాఖ్య‌ల వెనుక ఉద్దేశాన్ని గ‌మ‌నించుకోలేక‌.. ఆయ‌న సంయ‌మ‌నాన్ని కోల్పోయి చేస్తున్న వ్యాఖ్య‌లు వైసీపీ పుట్టి ముంచుతున్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ నిజానిజాలు, ఎవ‌రు ఎలాంటి వారు అనే విష‌యాల‌ను పూర్తిగా అవ‌గాహ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.