బీజేపీతో ఆట‌… ఇప్పుడు బాబు టైం వ‌చ్చిందా

2014లో జ‌ట్టు క‌ట్టి.. అప్ప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌తో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మ‌రింత గ‌ట్టి ప‌డుతుంద‌ని, బాబు మ‌రింత స‌న్నిహిత‌మ‌వుతార‌ని, బీజేపీ అండ‌కోసం బాబు మ‌రిన్ని అడుగులు ముందుకు వేస్తార‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన వార్త‌లు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమార‌య్యాయి. నంద్యాల ఉప పోరు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డం, జ‌గ‌న్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు న‌డ‌వ‌డం, 2014లో త‌న‌తో క‌లిసి వ‌చ్చిన ప‌వ‌న్ త‌ట‌స్థ వైఖ‌రి అవ‌లంబించ‌డంతో బాబు ఒంట‌రిగానే ఈ పోరును చాలెంజ్‌గా తీసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న అభివృద్ధి మంత్రాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. అదేవిధంగా త‌న సీనియార్టీని కూడా ప్ర‌జ‌ల్లో ప్ర‌చారంలో పెట్టారు. ఇక‌, ప్ర‌తి ఒక్క‌రిలోనూ విప‌క్షం దుందుడుకు త‌నంపై అవ‌గాహ‌న క‌ల‌గించే ప్ర‌సంగాల‌తో బాబు ఆక‌ట్టుకున్నారు. పార్టీ మొత్తాన్నీ ఏక‌తాటిపైకి తెచ్చారు. విప‌క్షం రెచ్చిపోయి నానా దుర్భాష‌లాడినా.. ఎక్క‌డా ఆవేశ ప‌డ‌కుండా ప్ర‌శాంతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. వీధి వీధి రోడ్డు రోడ్డున బాబు పాల‌న ప్ర‌గ‌తి క‌నిపించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అంత‌కు మించి రాబోయే రోజుల్లో మ‌రింత అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని ప్ర‌జ‌ల్లో భ‌రోసా క‌ల్పించారు.

దీంతో నంద్యాల పోరు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. అంతేకాదు, ఏ మాత్రం ప‌ట్టులేని గ్రామీణ ప్రాంతాల్లోనూ టీడీపీ సైకిల్ రివ్ రివ్వున సాగిపోయింది. క‌లిసి వ‌స్తారో లేదో అనే భ‌యంతో ఉన్నముస్లిం వ‌ర్గం 82% సైకిల్‌పై స‌వారీ చేసి చంద్ర‌న్న‌కు జైకొట్టింది. ఈ నేప‌థ్యంలోనే మిత్ర ప‌క్షం బీజేపీ ప్ర‌చారం చేస్తామ‌న్నా.. కొన్ని అంత‌ర్గ‌త విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో బాబు వారిని దూరంగా పెట్టారు. ఇలా ఎలా చూసినా.. బాబు ఒంట‌రి విజ‌యంగా నంద్యాల రికార్డు సృష్టించింది. దీంతో 2014కు ముందు ఉన్న బెరుకు ఇప్పుడు చంద్ర‌బాబులో క‌నిపించ‌డం లేదు.

2019పై ఆశ‌లు మ‌రింత‌గా చిగురించాయి. అభివృద్ధి మంత్రం, త‌మ్ముళ్ల‌ను స‌రైన మార్గంలో న‌డిపించ‌డం ఇవే విజ‌యానికి గీటు రాళ్లుగా భావిస్తున్న చంద్ర‌బాబు అప్ప‌టికి త‌న‌తో ఎవ‌రు క‌లిసొచ్చినా క‌లిసి రాక‌పోయినా ఫ‌ర్వాలేద‌నే ధోర‌ణిలో ఉండ‌డం తాజా రాజ‌కీయ సంచ‌ల‌నం. అయితే, బీజేపీ ఇప్పుడు ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌రకు బాబు కోసం ఎదురు చూస్తోంది. ఆయ‌న ఫోన్ కోసం ప‌రిత‌పిస్తోంది. తాము టీడీపీతోనే ఉంటామ‌ని క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా ప్ర‌క‌టించారంటే.. బాబు కెపాసిటీ పెరిగింద‌నేగా. మ‌రి బాబు ఎలా వ్య‌వ‌హ‌రిస్తాడో చూడాలి.