కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితం ఇలా ఉండ‌బోతోందా..!

కాకినాడ కార్పొరేషన్‌లో గెలుపు తమదే అని రెండు ప్రధాన పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేయర్‌ పీఠం మాదే, మెజారిటీ డివిజన్లూ మావే అంటూ టీడీపీ, వైసీపీ నేత‌లు ఎవ‌రికి వారు అంచ‌నాల్లో మునిగి తేలుతున్నారు. శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు కాకినాడ కార్పొరేష‌న్ ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌వుతుంది. మ‌ధ్యాహ్నానికి పూర్తి ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయి.

కాకినాడ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకుగాను పొత్తులో భాగంగా 39 చోట్ల టీడీపీ, 9 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. ప్రతిపక్ష వైసీపీ 48 డివిజన్లలోనూ బరిలోకి దిగింది. మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలంటే ఏ పార్టీకైనా 25 డివిజన్లు రావాల్సి ఉంది. అయితే అధికార టీడీపీకి ముగ్గురు కో ఆప్ష‌న్ స‌భ్యులు ఉండ‌డంతో ఆ పార్టీకి 22 సీట్లు వ‌స్తే చాలు మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునే ఛాన్సులు ఉన్నాయి. ఇది టీడీపీకి బాగా క‌లిసొచ్చే అంశం.

కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వ‌న‌మాడి కొండ‌బాబు, రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత‌లక్ష్మి, ఎమ్మెల్సీ ర‌వికిర‌ణ్ వ‌ర్మ ముగ్గురు టీడీపీకి కో ఆప్ష‌న్ స‌భ్యులుగా ఉన్నారు. ఇక ఇక్క‌డ గెలుపు ఓట‌ముల‌పై ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి, రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం టీడీపీకి 30కు త‌గ్గ‌కుండా డివిజ‌న్లు వ‌స్తాయంటున్నారు.

పొత్తులో భాగంగా 9 డివిజ‌న్ల‌లో పోటీ చేసిన బీజేపీ 2-3 డివిజ‌న్లు గెలుచుకోనుంది. ఇక వైసీపీ వాళ్లు త‌మ‌కు 28 వ‌ర‌కు వ‌స్తాయ‌ని లెక్క‌లు వేసుకుంటున్నా ఆ పార్టీకి 10-12 డివిజ‌న్ల‌ను గ‌రిష్టంగా గెలుచుకుంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు. టీడీపీ వాళ్లు రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకోవ‌డంలో స‌క్సెస్ అవ్వ‌గా, వైసీపీ మాత్రం చేతులు ఎత్తేసింది.

ఇక వైసీపీలో కాకినాడ సిటీ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ముత్తా శ‌శిధ‌ర్ ఇద్ద‌రూ గ్రూపులుగా విడిపోయి త‌మ అనుచరులకు సీట్లు ఇచ్చుకోవడంతో పార్టీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను చవి చూడాల్సివచ్చింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తా శశిధర్‌ 12 డివిజన్లు తీసుకుని అనామకులకు సైతం సీట్లు ఇచ్చేశారని, వాటిలో ఒకటి మాత్రమే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. మరో డివిజన్‌ ఇన్‌ఛార్జి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇచ్చిన డివిజన్లలో ఎక్కువ మంది విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఏం చెపుతోంది….

ఈ రెండు పార్టీల లెక్క‌లు ఎలా ఉన్నా ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు చంద్ర‌బాబుకు ఇచ్చిన నివేదిక‌లో టీడీపీకి 35-37 సీట్లు వ‌స్తే బీజేపీకి 2-3, వైసీపీకి 8-10 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని పేర్కొన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా కాకినాడ ఓట‌రు ఫ‌లితం ఎలా ఉందో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నానికి తేలిపోనుంది.