జ‌ట్టుక‌ట్ట‌నున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?

ఏపీ రాజ‌కీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోతున్నాయా? నిన్న‌టి వ‌ర‌కు తిట్టిపోసిన వాళ్ల‌నే అక్కున చేర్చుకుని ఆద‌రించేందుకు పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయా? ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన మిత్రుల‌కు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు ఆర్ణ‌బ్ గోస్వామి!! రెండు పార్టీల‌కు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యాలే ఇక‌పై ఏపీని శాసించ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒక‌టి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ 2019 ఎన్నిక‌లే ధ్యేయంగా క‌లిసి న‌డిచేందుకు, కొత్త కాపురం పెట్టేందుకు తెర వెనుక అన్నీ జ‌రిగిపోతున్నాయ‌ని గోస్వామి వెల్ల‌డించారు. మ‌రి వివ‌రాలు చూస్తే.. చాలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తున్నాయి..

ఏపీలో 2019లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు అత్యంత కీల‌కం! అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల‌కు ఈ ఎన్నిక‌లు మ‌రీ కీల‌కం. 2019లో మ‌రోసారి గెలిచి త‌న పాత రికార్డును ప‌దిలం చేసుకోవాల‌ని, కుదిరితే.. మ‌రో 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్లాన్‌తో ఉన్నారు. ఇక‌, 2014లో అందివ‌చ్చిన అధికారం తృటిలో చేజారిపోవ‌డంతో ఎప్పుడెప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయా? ఎప్పుడెప్పుడు సీఎం సీటును కైవ‌సం చేసుకుందామా? అని వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడీ ఉన్నారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన ఫ్యూచ‌ర్ స్టోరీ! అయితే, ఇంత‌లోనే బీజేపీ కూడా ఏపీపై క‌న్నేసింది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో వేళ్లూనుకోవాల‌ని క‌మ‌ల నాధులు ఎప్ప‌టి నుంచో ట్రై చేస్తున్నా.. ఒక్క క‌ర్ణాట‌క‌లో త‌ప్ప వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు.

దీంతో రాష్ట్ర విభ‌జ‌న‌కు గ‌ట్టిగా మ‌ద్ద‌తిచ్చి.. తెలంగాణ‌లోను, ఏపీ అభివృద్ధికి క‌ట్టుబ‌డ‌తామ‌ని ఏపీలోనూ ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 2014లో బాబుతో పొత్తు పెట్టుకుని ప్ర‌భుత్వంలో చేరి మంత్రివ‌ర్గంలో రెండు సీట్లు కూడా సాధించారు. అయితే, వీరి ఆశ‌లు రెట్టింపు అయ్యాయి. 2019లో ఏపీలో శాసించే స్థాయికి ఎద‌గాల‌ని భావించారు. ఈ నేప‌థ్యంలో వీరికి ఆట‌లో అరిటిపండులా జ‌గ‌న్ క‌నిపించారు. ఆయ‌న‌పై ఉన్న కేసులు, ఆర్థిక లావాదేవీలు వారికి అంది వ‌చ్చిన వ‌రంగా మారాయి. ఇంకే ముంది. 2019లో అయితే బాబు, లేకుంటే జ‌గ‌న్ తో దోస్తీ క‌ట్టి.. స‌గం సీట్ల‌ను సాధించాల‌ని క‌మ‌ల ద‌ళాధిప‌తులు సిద్ధ‌మ‌య్యారు.

నిజానికి చంద్ర‌బాబు అయితే, బీజేపీ కోరిన‌న్ని సీట్లు ఇచ్చేందుకు ముందుకు రారు. కానీ, జ‌గ‌న్ ప‌రిస్థితి అలా లేదు. ఆయ‌న‌కు సీఎం కావ‌డం ఒక్క‌టే ల‌క్ష్యం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే టికెట్ల‌లో కోరిన‌న్ని బీజేపీకి క‌ట్ట‌బెట్టేందుకు రెడీగా ఉన్నారు. దీనిపైనే దృష్టి పెట్టిన బీజేపీ.. అన్ని విధాలా త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాడ‌ని భావించిన జ‌గ‌న్‌తో జ‌ట్టు క‌ట్టేందుకు సిద్ధ‌మైంది. దీనికి క‌ర్ణాట‌క‌కు చెందిన మైనింగ్ రారాజు జ‌నార్ద‌న్ రెడ్డి మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెరిపార‌ని గోస్వామి త‌న రిప‌బ్లిక్ టీవీ క‌థ‌నంలో వివ‌రించారు. బీజేపీలో గ‌తంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన జ‌నార్ద‌న్‌రెడ్డి.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ పార్టీకి క్రియాశీల‌కంగా మారార‌ని, ఆయ‌నే జ‌గ‌న్‌ను నేరుగా అమిత్ షా, త‌ర్వాత మోడీ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లార‌ని క‌థ‌నంలో పేర్కొన్నారు.

దీంతో క‌మ‌ల ద‌ళాధిప‌తులు.. జ‌గ‌న్‌కి ఎంతో కొంత సాయం చేయ‌డంతోపాటు.. తాము ఏపీలో పూర్తిస్థాయిలో విస్త‌రించేందుకు అవ‌స‌రమైన ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు. ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. త‌న‌కు సీఎం సీటు త‌ప్ప‌నిస‌రిగా కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఆర్థిక లావాదేవీల్లో పూర్తిగా ఇబ్బందులు ప‌డుతున్న జ‌గ‌న్‌కు అధికారం అనే దిక్సూచి త‌ప్ప‌క అవ‌స‌రం అనేది ఆయ‌న త‌ర‌ఫువారి వాద‌న‌. దీంతో బీజేపీతో జ‌ట్టుక‌ట్టేందుకు సైతం ఆయ‌న రెడీ అయ్యార‌ని గోస్వామి వివ‌రించారు.

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థుల‌కు అడ‌గ‌కుండానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని కూడా తెలిపారు. సో.. మొత్తానికి బీజేపీ-వైసీపీ కొత్త కాపురం ఏర్పాటుకు ఏపీ వేదిక కానుంద‌ని తెలుస్తోంది. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. ఒక‌వేళ ఈపార్టీ స‌గం సీట్ల‌ను ఇచ్చేందుకు బీజేపీకి ఆఫ‌ర్ ఇస్తే అప్పుడు మాత్రం ప‌రిస్థితి మ‌ళ్లీ య‌థాత‌థంగా ఉంటుంద‌నేది క‌థ‌నం పేర్కొంటోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు క‌దా!! ఇప్పుడు ఇదే ఫార్ములాను బీజేపీ ఫాలో అయిపోతోంది.