వెంక‌య్యకు స‌న్మానం వెన‌క కేసీఆర్ ఓట్ల వ్యూహం

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవ‌రికీ తెలియ‌వు. ఆయ‌న ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుని.. షాకులిస్తారో అని ప్ర‌త్య‌ర్థులు ఆందోళ‌న చెందుతూనే ఉంటారు. ఏదో సాదాసీదా కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. లేక ఏదైనా చిన్న మాట మాట్లాడినా వాటి ఫ‌లితం మాత్రం దిమ్మ‌దితిరిపోయేలా ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం ఉండ‌దు. మ‌రి రెండేళ్ల‌లోపే ఎన్నిక‌లు వ‌స్తున్న త‌రుణంలో.. అన్ని వ‌ర్గాలు టీఆర్ఎస్‌కు ప‌ట్టం క‌ట్టేలా ఆయ‌న ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఇందులో చాలా వ‌ర‌కూ స‌క్సెస్ అయిన ఆయ‌న‌.. ఇప్పుడు క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లపై దృష్టిపెట్టారు. ఒకే ఒక్క స‌న్మానంతో వారిని కూడా త‌న బుట్ట‌లో వేసేసుకున్నారు.

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడిని తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌నంగా స‌త్క‌రించింది. స్వ‌యంగా కేసీఆర్‌.. ఈ వ్య‌వ‌హారాల‌న్నింటినీ ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నారు. దాదాపు రూ.15కోట్ల వ‌ర‌కూ ఖర్చు పెట్టి అట్ట‌హాసంగా.. ఆడంబ‌రంగా నిర్వ‌హించార‌ని చెబుతున్నారు. అంతేగాక ఈ స‌భ‌లోనే కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. సాధార‌ణ సంద‌ర్భాల్లో గురువులు, ఇత‌ర పెద్దవాళ్లు ఉంటే వెంట‌నే కేసీఆర్ పాదాభి వంద‌నం చేసి అందరి దృష్టిని ఆక‌ర్షిస్తారు. అయితే ఇప్పుడు అలాంటివి చేయ‌క‌పోయినా.. వెంకయ్యనాయుడికి కెసీఆర్ తిలకం దిద్ది.. అత్తరు పూసి.. పన్నీరు చల్లి మరీ స‌న్మానించారు! ఇదే ఇప్పుడు సందేహాల‌కు తావిస్తోంది.

ఇంత ఆర్భాటంగా స‌న్మానం చేయడం వెనుక కేసీఆర్‌.. ప్ర‌ణాళిక మాత్రం వేరే ఉంద‌ట‌. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా కేసీఆర్‌ను దెబ్బ‌కొట్టాల‌ని ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఇప్ప‌టికే వ్యూహాలు మొద‌లుపెట్టేశాయి. వీటిని ఒక కంట క‌నిపెడుతూనే.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువయ్యే ప‌థ‌కాలు కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టేస్తున్నారు. రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు.. ఇలా అంద‌రి కోసం ఒక్కో అస్త్రం బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కులాల వారీగానూ లెక్క‌లేస్తున్నారు కేసీఆర్‌! ప్రస్తుతం రెడ్డి సామాజిక‌వ‌ర్గంతో పాటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లు కూడా తెలంగాణ‌లో కీల‌కం. వీరు సుమారు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి. వీరిని కూడా త‌మ వైపు తిప్పుకోవాలంటే ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు వేశారు.

ఈ నేప‌థ్యంలోనే అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ వెంక‌య్య‌ను ఘ‌నంగా స‌న్మానించ‌డంతో పాటు ప్ర‌శంస‌లు కూడా కురిపించేశారు. కేసీఆర్ మాట‌, చేత‌కు వెంక‌య్య‌ కూడా ముగ్ధుడైపోయారంటే ఏ రేంజ్‌లో వేడుక నిర్వ‌హించారో తెలుసు కోవ‌చ్చు! ఈ దెబ్బ‌తో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కేసీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ఇప్ప‌టివ‌ర‌కూ క‌మ్మ సామాజిక‌వ‌ర్గమంతా టీడీపీకే స‌పోర్ట్‌గా ఉంది. ఇప్పుడు వెంక‌య్య స‌న్మానంతో.. వీరంతా టీఆర్ఎస్ గురించి ఆలోచించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని వివ‌రిస్తున్నారు. మ‌రి జ‌నాల్ని ఆక‌ట్టుకోవ‌డంలో ఎంతైనా కేసీఆర్ స్టైలే వేరు!!