బాబు `ముంద‌స్తు` ప్ర‌ణాళిక తెలిస్తే షాకే!!

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం మాదే అంటే మాదే అని టీడీపీ, వైసీపీ ధీమాగా ఉన్నాయి. అంతేగాక ఎవ‌రికి ఎంత మెజారిటీ వ‌స్తుందో అని లెక్క‌లు కూడా వేసేసుకుంటున్నాయి. త‌న మూడేళ్ల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గెలుపే నిద‌ర్శ‌న‌మ‌ని భావించిన‌ టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి 15 వేల మెజారిటీ వ‌రకూ వ‌స్తుంద‌ని అంత‌ర్గ‌త స‌ర్వేల్లో తేలింది. అది స‌రిపోద‌ని ఇంకా పెంచాల‌ని నేత‌ల‌ను ఆయన ఆదేశించ‌డం గ‌మ‌నిస్తే.. స‌రికొత్త వ్యూహంలో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. విజ‌యం అందించిన ఉత్సాహం నీరుగా ర‌కుండా.. ఆయ‌న `ముంద‌స్తు` ఎన్నిక‌ల‌కు కూడా వెళ్లే అవ‌కాశం లేక‌పోలేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

నెల రోజుల నుంచి రాష్ట్ర రాజకీయం మొత్తం నంద్యాల చుట్టూనే తిరుగుతోంది. మొదట్లో నంద్యాలలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావించారు. ముస్లిం,మైనార్టీ, ఎస్సీ, కాపు,బలిజ,రెడ్డి తదితర సామాజికవర్గాలన్నీ తమ పార్టీకే ఓటు వస్తాయ‌ని అనుకున్నారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలన్నీఅధికార టీడీపీ వైపు నిలిచాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. టీడీపీకి మెజార్టీ ఎంత వస్తుంద‌న్నదానిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా అంచనా వేస్తున్నారు. మెజార్టీ కనుక 30వేలకు పైగా వస్తే రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతాయని కొందరు రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబుపాలనపై సంతృప్తితోనే ఇంత మెజార్టీ వచ్చిందని, దీనిని ఆధారంగా చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే అభిప్రాయం అధికార పార్టీలో వినిపిస్తోంది. ఈ ఏడాది ఆఖరులో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతోపాటు ఆంధ్రా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్నది టీడీపీలో కొందరి అభిప్రాయం. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రజల్లో అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉందని జరిగిన ప్రచారం బూటకమేననేది తేలిపోతుంద‌ని.. ఇది పాజిటివ్‌గా మారుతుంద‌ని వివ‌రిస్తున్నారు.

తాజా నంద్యాల ఎన్నికల ఫలితంతో వైకాపా బలం తగ్గిపోతుందని, అదే సమయంలో బీజేపీకి చెక్‌ పెట్టవచ్చేని మరో అభిప్రాయం. ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉన్న పరిస్థితుల్లో ఈ రెండేళ్లు బిజెపిని భరించేకన్నా… ఎన్నికలకువెళ్లి వాళ్లతోనూ తాడోపేడో తేల్చుకోవచ్చని కొంద‌రు వివ‌రిస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానని, అప్పటి వరకు ఎన్నికల జోలికి వెళ్లనని చెబుతున్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌’కు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఉండదనేది మరో విశ్లేషణ. పార్టీ నిర్మాణంలోనే ఉంది క‌నుక ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీడీపీకి బ‌ద్ద‌తు ఇవ్వ‌క త‌ప్ప‌దని చెబుతున్నారు. మ‌రి ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం అనూహ్య మార్పులే తీసుకొస్తాయి!!