బాల‌య్య‌కు టీడీపీ ఝుల‌క్‌..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యేకు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీ మార్క్ ఝుల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య త‌మ జిల్లాకు వ‌స్తున్నాడ‌ని తెలిసినా ఎమ్మెల్యేలు మాత్రం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలే కాదు, బాల‌య్య ఫ్యాన్స్ సైతం ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. దశాబ్దాల పాటుగా బాలకృష్ణ అభిమాన నేతలుగా కొనసాగుతన్న వారు సైతం ఈ కార్య‌క్ర‌మానికి రాక‌పోవ‌డం ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నుడా (నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆధారిటీ )చైర్మన్‌గా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నియమితులయ్యారు. సీనినటుడు బాలకృష్ణ సిఫార్సుతోనే ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్కింది. దీంతో కోటంరెడ్డి బాల‌య్య స‌మ‌క్షంలోనే ఈ ప‌ద‌వి ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని భావించి ఆయన్ను ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అట్ట‌హాసంగా ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు న‌గ‌రం మొత్తం బాల‌య్య ఫ్లెక్సీల‌తో నిండిపోయింది. అయితే ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటు బాల‌య్య అభిమాన సంఘాలు సైతం డుమ్మా కొట్టి అంద‌రికి షాక్ ఇచ్చాయి. అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనురాధ‌, వారి వర్గం పూర్తిగా దూరంగా ఉన్నారు. అలాగే బాలకృష్ణ అభిమాన సంఘ అధ్యక్షుడు కిన్నెర బ్రదర్స్‌ కూడా సభకు రాలేదు. దీంతో బాల‌య్య అభిమాన సంఘాల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇక ఈ స‌భ‌కు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు అయిన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు ఆనం బ్రదర్స్, నగర టీడీపీ కార్పొరేటర్లు సభకు దూరంగా ఉన్నారు. ఇక బాల‌య్యను ఘ‌నంగా స‌న్మానించిన వారిలో టీడీపీ నేత‌ల‌తో పాటు చిరంజీవి వీరాభిమానులు ఉన్నారు. దీనిపై ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సైతం ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది.