జ‌గ‌న్‌లో మార్పు వెనుక కార‌ణాలివేనా.. 

సీఎం చంద్ర‌బాబు 2014లో అధికారంలోకి రావ‌డానికి ఆయ‌న సీనియ‌రిటీనేగాక‌, ఉద్యోగులు కూడా కొంత కార‌ణం! 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోవ‌డానికి కార‌ణం కూడా ఉద్యోగులే! `నేను మారాను. గ‌తంలోలా ఉద్యోగుల‌తో క‌ఠినంగా వ్య‌వహ‌రించ‌ను` అని చంద్ర‌బాబు పదేప‌దే చెబుతూ వారిలో న‌మ్మ‌కం క‌లిగేలా చేశారు. ఇక 2019 ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్.. ఇప్ప‌టినుంచే `నేను మారాను` అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేత‌లే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న స‌భ‌ల్లో ఆయ‌న తీరు చూసిన వారంతా.. ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన‌ సంకేతాలు ఇస్తున్నార‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిపై వైసీపీ నుంచి బ‌య‌టికొచ్చిన నేత‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న‌లో ఒంటెత్తు పోక‌డ ఎక్కువ‌ని, ఎవ‌రినీ గౌర‌వించ‌ర‌ని.. ముఖ్యంగా సీనియ‌ర్లంటే అస్స‌లు విలువ ఇవ్వ‌ర‌ని.. ఆయ‌న చెప్పిందే వేద‌మ‌ని భావిస్తుంటార‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల కొన్ని వ‌ర్గాలు జ‌గ‌న్‌కు దూరమ‌య్యాయ‌ని ఇప్ప‌టివ‌ర‌కూ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. త‌న‌మీద ఉన్న అప‌వాదుల‌ను వీలైనంత‌గా త‌గ్గించుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న వ్య‌వ‌హార‌శైలిని పూర్తిగా మార్చుకుని.. స‌రికొత్త జ‌గ‌న్‌ను చూపిస్తున్నారు. మారుతున్నాను అనే ఫీడ‌ర్లు ప్ర‌జ‌ల్లోకి పంపుతున్నారు.

మొన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితులు, దళితేత‌రుల‌తో మాట్లాడిన తీరు! నిన్న ఎన్డీఏ బీజేపీ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు పాదాభివంద‌నం చేయడం.. ఇప్పుడు ఈ రెండు సంఘ‌ట‌న‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను అబ్బుర‌పరుస్తున్నాయి. సాధారణంగా జ‌గ‌న్‌.. ఏ స‌భ నిర్వ‌హించినా అందులో ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతారు. ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, రెండేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం వస్తుంద‌ని అప్పుడు న్యాయం చేస్తామ‌ని చెబుతారు. కానీ గ‌ర‌గ‌ప‌ర్రు సంఘ‌ట‌న ఆయ‌న‌లోని మ‌రో కోణాన్ని వెలికి తీసింది. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు లేవు. `మ‌న ప్ర‌భుత్వం` అన్న మాట‌లు లేవు. సామ‌రస్యంగా క‌లిసి మెలిసి ఉండాల‌ని సూచించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఇక ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో క‌లిసి వెళ్లిన జ‌గ‌న్‌.. కోవింద్‌కు పాదాభివంద‌నం చేయ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సాధార‌ణంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇలా పాదాభివంద‌నాలు చేస్తుంటారు. ఉత్త‌రాదిలో ఎవ‌ర‌కూ ఇంత‌లా చేసిన సంఘ‌ట‌న‌లు కూడా కనిపించ‌వు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ లాంటి స్వ‌భావం ఉన్న వ్య‌క్తి.. పాదాభివంద‌నం చేయ‌డం కొంత ఆశ్చ‌ర్యం క‌లిగించ‌కమాన‌దు. అయితే ఈరెండు సంఘ‌ట‌న నుంచి.. జ‌గ‌న్ త‌న‌లో మార్పు వ‌చ్చింద‌ని.. ప్ర‌జ‌లకు సంకేతాలు ఇస్తున్నాడ‌న్న‌ది ఖాయం!! గ‌తంలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమ‌ర్శలు చేసిన నాయ‌కులే ఇప్పుడు కిమ్మ‌న‌డం లేదు.