నంద్యాల టీడీపీలో `ఎవ‌రికి వారే య‌మునా తీరే’

నంద్యాల ఉప ఎన్నిక‌ల అధికార పార్టీ నేత‌ల్లో విభేదాలు సృష్టిస్తోంది. ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌న నాటి నుంచి వ‌రుస విభేదాలు ర‌గులుతున్న వేళ‌.. అంత‌ర్గ‌త క‌ల‌హాలు ముదిరి పాకాన ప‌డ్డాయ‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల్సిన చోట `ఎవ‌రికి వారే య‌మునా తీరే` అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా త‌మ‌కు ప‌ట్టున్న నియోజక‌వ‌ర్గంలో వేరే వారికి గెలుపు బాధ్య‌తలు అప్ప‌జెప్ప‌డాన్ని మంత్రి అఖిల‌ప్రియ జీర్ణించుకోలే క‌పోతున్నారు. తన తండ్రి నియోజక‌వ‌ర్గంలో.. ఇత‌రుల ప్ర‌మేయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట‌. దీంతో ముఖ్య‌మైన స‌మావేశానికి కూడా ఆమె డుమ్మా కొట్ట‌డం చర్చ‌నీయాంశ‌మైంది.

నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి ఇద్దామనే విషయంపై కుటుంబంలోనే విభేదాలొచ్చాయి. తనకే ఇవ్వాలని భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె నాగమౌనిక కోరుకున్నారు. అయితే, బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని అఖిల పట్టుబట్టింది. అనుకున్నట్టుగానే ఆయనకు టికెట్‌ ఇప్పించుకున్నారు. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు కొనసాగాయి. నేరుగా సీఎం రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు. మంత్రితో సంబంధం లేకుండానే ఏవీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. ఇక ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు విడిగానో లేదా ఫరూఖ్‌ వర్గంతోనో కలిసి ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం.

నంద్యాల ఉప ఎన్నిక మొత్తం భారాన్ని తానే మోయాలని మొదట్లో మంత్రి అఖిలప్రియ భావించారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆమె సవాల్‌పై సీఎం సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గాలని ఆదేశించారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికకు ఇప్పుడే ఇన్‌చార్జ్‌లను నియమించాల్సిన అవసరం లేదని నేరుగా సీఎంకే అఖిలప్రియ తేల్చిచెప్పారు. అయితే, ఇందుకు భిన్నంగా ఏపీఐడీసీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ను నంద్యాలకు పంపించారు. ఇది ఆమెకు ఏ మాత్రమూ మింగుడుపడటం లేదు.

ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక కోసం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఏపీఐడీసీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించడంపై మంత్రి అఖిలప్రియ చంద్ర‌బాబుపై తీవ్ర అస‌హ‌నంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరుకాలేదని తెలిసింది. ఈ సమావేశాన్ని మొత్తం మాజీ మంత్రి ఫరూఖ్, కేఈ ప్రభాకర్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి నడిపించారు. మరోవైపు భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు చర్చ సాగుతోంది. మరోవైపు సీనియర్లను కూడా ఆమె ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.