‘నిన్ను కోరి’ TJ రివ్యూ

సినిమా: నిన్ను కోరి

న‌టీన‌టులు: నాని, నివేద థామ‌స్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పృథ్వి త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

సంగీతం: గోపీ సుంద‌ర్‌

నిర్మాత‌: డీవీవీ.దాన‌య్య‌

స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌

ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌

క‌థ ఎలా ఉంది…

నిన్ను కోరి సినిమా క‌థా ప‌రంగా చూస్తే కొత్త‌దేం కాదు. అప్పుడెప్పుడో దాస‌రి స్వ‌యంవ‌రం సినిమా నుంచి నేటి వ‌ర‌కు ఈ లైన్‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఇద్ద‌రు ప్రేమికులు ప్రేమించుకోవ‌డం…వాళ్ల‌లో అమ్మాయికి త‌ల్లిదండ్రులు వేరే పెళ్లి చేసేయ‌డం, చివ‌ర‌కు వారిద్ద‌రు ఏం చేశారు ? ఈ లైన్‌లో క్లైమాక్స్ ఒక్కో సినిమాలోను ఒక్కో రకంగా ఉంటూ వ‌స్తోంది. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలో చివ‌ర‌కు ఎవ‌రో ఒక‌రు త‌మ ప్రేమ‌ను త్యాగం చేస్తుంటారు. కానీ ఇక్క‌డ ద‌ర్శ‌కుడు భిన్నంగా ముగింపు ట‌చ్ ఇచ్చాడు.

నిన్ను కోరి క‌థ నివేద నానిని క‌ల‌వ‌డానికి వెళుతుండ‌గా స్టార్ట్ అవుతుంది. వీరికి వెంట‌నే త‌మ గ‌తం గుర్తుకు వ‌స్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండే ప్రేమికులు. ఇద్ద‌రి మ‌ధ్య చిన్న గ్యాప్. కెరీర్ ముఖ్య‌మ‌నుకునే నాని ఢిల్లీకి వెళ్లిపోతాడు. కానీ ప్రేమించిన అమ్మాయిని మాత్రం మ‌ర్చిపోలేడు. అటు తండ్రి మాట‌కు ఎదురు చెప్ప‌లేక నివేద ఆదిని పెళ్లి చేసుకుంటుంది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే ఆది నానికి ఫ్రెండ్‌. ఈ టైంలో ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగి ? ఎలా ముగిశాయి ? అన్న‌దే నిన్ను కోరి స్టోరి.

ఎలా చేశారు….

ఈ సినిమాలో నాని న‌ట‌న చూసిన యూత్‌, మోడ్ర‌న్ జ‌న‌రేష‌న్ జ‌నాలంద‌రూ ఎమోష‌న‌ల్‌గా బాగా క‌నెక్ట్ అవుతారు. నాని ప్రేమికుడిగాను, ప్రేమించిన ప్రియురాలికి దూర‌మై ప‌డే బాధ‌లోను, కామెడీ టైమింగ్‌లోను ఇలా అన్ని వేరియేష‌న్ల‌లో అద‌ర‌గొట్టేశాడు. అలాగే తన ప్రియురాలు మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నా…ఎప్ప‌ట‌కీ అయినా త‌న‌కు ద‌క్క‌క‌పోదా అన్న చిన్న స్వార్థం ఉన్న వ్య‌క్తిగా కూడా మెప్పించాడు.

ఇక నివేద ఇటు ప్రియురాలిగా, అటు త‌న ప్రేమికుడు ఏమైపోతాడా ? అన్న ఆవేద‌న ఉన్న అమ్మాయిగా, అటు త‌న భ‌ర్త‌ను మెప్పించ‌లేక ఆవేద‌న చెందే భార్య‌గా ఆక‌ట్టుకుంది. న‌ట‌నా ప‌రంగా అన్ని ర‌కాలుగా నాని, నివేద పోటీ ప‌డి న‌టించారు. ఇక ఆది కూడా త‌న పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. హీరోయిన్‌గా తండ్రిగా చేసిన ముర‌ళీశ‌ర్మ‌, అత‌డి అల్లుడిగా చేసిన పృథ్వి పాత్ర‌ల్లో మెప్పించారు.

ఎలా తీశారు…

క‌థంతా పాత‌దే..కానీ తీసిన విధానం మాత్రం ఆక‌ట్టుకుంది. నిన్ను కోరి యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ప్ర‌స్తుత త‌రం యువ‌త ప్రేమ‌, పెళ్లి, కెరీర్ విష‌యాల్లో ఎలా ఆలోచిస్తున్నారు. నిజ‌మైన ప్రేమికులు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు అన్న అంశాల‌ను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేశాడు. ప్రేమికులు దూర‌మైతే ఎలాంటి బాధ అనుభ‌విస్తారన్న అంశాలు హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు కొత్త వాడైనా ఎక్క‌డా త‌ప్పులు దొర్ల‌కుండా సినిమాను తెర‌కెక్కించిన తీరు హ్యాట్సాప్‌.

ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకునే తీశారు. పాత్ర‌ల తీరు, సినిమా క‌థ‌నం మెచ్యూర్డ్‌గా ఆలోచించే వారికి, యూత్‌కే ఎక్కువుగా క‌నెక్ట్ అవుతుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కోరుకునేవారికి, మాస్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాద‌ని చెప్ప‌డం స‌రికూడా కాదు. ఎమోష‌న‌ల్‌గా కంట త‌డిపెట్టించిన డైరెక్ట‌ర్ అంతలోనే కామెడీతో న‌వ్వించాడు.

హీరో, హీరోయిన్లు డిఫ‌రెంట్ వేరియేష‌న్ల‌లో చేసిన న‌ట‌న సినిమాకే హైలెట్‌. కార్తీక్ ఘట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ, గోపీ సుంద‌ర్ మ్యూజిక్‌, ఎడిటింగ్ అన్ని సాంకేతిక విభాగాల‌కు తోడుగా దాన‌య్య పెట్టిన ఖ‌ర్చు సినిమాను మ‌రో మెట్టు ఎక్కించాయి.

ఫైన‌ల్‌గా…

నాని కెరీర్‌లో నిన్ను కోరి మ‌రో క్లాస్ హిట్‌

రేటింగ్‌: 3 / 5

పంచ్‌లైన్‌: ఏ క్లాస్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ