రాజ‌కీయాల్లో కొత్త సంస్కృతికి తెర‌తీసిన జ‌గ‌న్‌

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వైసీపీని ఈసారి ఎలాగైనా విజ‌య‌తీరాల‌కు చేర్చాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ఏరికోరి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తిరుగులేని మైలేజ్ ఉన్న ప్ర‌శాంత్ కిశోర్‌ను ప‌క్క‌న‌పెట్టుకున్నారు. ఆయ‌న రాక‌తో వైసీపీకి తిరుగులేద‌ని నేత‌లు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌న ప‌ని మొద‌లుపెట్టేశారు. సంప్ర‌దాయాల‌కు భిన్నంగా స‌రికొత్త పంథాలో వెళుతుండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ్రామాల్లో సర్వేలు, ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణ శిబిరాలు, మ‌రీ ముఖ్యంగా ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌స్తుతం ఏపీలో `కార్పొరేట్ సంస్థ‌ల త‌ర‌హా రాజ‌కీయాలు ప్ర‌వేశించాయి, కార్పొరేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాల కోసం ఎంట్ర‌న్స్‌ ప‌రీక్ష‌లు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించ‌డం.. అందులో ఎంపికైన వారిని సంస్థ‌ల్లోకి తీసుకుని శిక్షణ ఇస్తుంటారు. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ రాజ‌కీయాల్లో క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఈ సంస్కృతి విస్త‌రిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఏకంగా తమ ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణ తదిత‌ర అంశాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ సలహాలు, సూచనలను వైసీపీ అధినేత అమలు పరుస్తున్నారు. ఇప్పటికే ప్ర‌శాంత్‌ బృందం… నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కో-ఆర్డినేటర్ల నేతల పనితీరుపై సర్వే ప్రారంభించింది. గ్రామాల్లో పర్యటించి అభ్యర్థుల పనితీరు గెలుపోట‌ములపై పరిశీలన మొదలుపెట్టింది. ప్రజా సమస్యలపై వైసీపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో వివిధ కోణాల్లో ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు సమాచారం.

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి… ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల బలాలు, బ‌లహీనతల‌పై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. గ‌తంలో త‌న వ్యూహాల‌తో బీజేపీ, కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన రికార్డు ప్రశాంత్ కిశోర్‌కు ఉంది. ఒక‌ప‌క్క టీడీపీ కూడా వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్న స‌మ‌యంలో.. ప్రశాంత్‌కిశోర్‌ సర్వేలు, ఇంటర్వ్యూలు జగన్‌కు ఏ మేరకు సహకరిస్తాయోన‌నే చ‌ర్చ మొద‌లైంది.