రోజాపై టీడీపీ అభ్య‌ర్థిగా రాజు గారేనా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై నిరంత‌రం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచే ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే రోజా! న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న ఆమెపై.. 2019 ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి కోసం సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థుల వేట‌లో ప‌డ్డారు. గ‌తంలో ఆమెపై పోటీచేసిన గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు పోటీ నుంచి విర‌మించుకోవ‌డంతో ఇప్పుడు కొత్త అభ్య‌ర్థి ఎవ‌రా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రి నుంచి పోటీచేయడానికి `రాజు`గారు ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. అంతేగాక ఆయ‌న ఆర్థికంగానూ బాగా బ‌ల‌మైన వ్య‌క్తి కావ‌డంతో.. చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌వైపే మొగ్గుచూపే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

తిరుమల జేఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు మరో ఏడాదిలో తెలుగుదేశంపార్టీలోకి చేర‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. అంతేగాక‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబు ఆశీస్సులు పొందారని స‌మ‌చారం. చిత్తూరు నగరి నియోజకవర్గానికి చెందిన శ్రీనివాసరాజు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడుకి అత్యంత సన్నిహితుడు. కిరణ్‌ హయాంలో తిరుమల జేఈవోగా నియ‌మితులైన ఆయ‌న‌.. ఇంకా ఆప‌ద‌విలోనే కొన‌సాగుతున్నారు. ప్రతిపక్షహోదాలో తిరుమలకు వచ్చిన చంద్రబాబును ప్రొటోకాల్‌ పాటించకుండా మొహం చాటేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయినా చంద్రబాబుకు ఆయ‌న చాలా ఇష్ట‌మైన అధికారి.

ఈ నేప‌థ్యంలోనే శ్రీనివాసరాజు రాజకీయప్రవేశంపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైకాపా అభ్యర్థి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నుంచి శ్రీనివాసరాజు పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ముద్దుకృష్ణమ నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ నియోజకవర్గం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆర్థిక పరిస్థితి తనకు లేదని ముద్దు చెబుతున్నారట. ఈ అవకాశాన్ని తెలుసుకున్న శ్రీనివాసరాజు పావులు కదిపారు…చంద్రబాబును ఆకట్టుకున్నారు. శ్రీనివాసరాజు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని, నగరి నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చార‌ని స‌మాచారం!

ఇందుకు బ‌ల‌మైన కార‌ణాలు కూడా లేక‌పోలేద‌ట‌. నియోజకవర్గంలో క్షత్రియ ఓటర్లు అధికసంఖ్యలో ఉండడం చంద్రబాబు సామాజికవర్గ ఓటర్లతో పాటు, బీసీ వర్గాల ఓట్లు అధిక సంఖ్యలో ఉండడం తనకు కలసి వస్తుందని శ్రీనివాసరాజు ధీమాతో ఉన్నారు. తిరుపతి ఎంపీ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఖర్చుతో పాటు ఎంపీ అభ్యర్థి ఖర్చునూ తానే భరిస్తానని శ్రీనివాసరాజు చంద్రబాబుకు చెప్పార‌నే ప్ర‌చారం జరుగుతోంది. మ‌రోముఖ్య విష‌య‌మేంటంటే ఇటీవ‌లే అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన‌ తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి శ్రీనివాసరాజు అత్యంత సన్నిహితుడు.