వైసీపీలో చేరేందుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే రంగం సిద్ధం!

ఏపీ మాజీ మంత్రి తీరు టీడీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు. ఒక‌ప‌క్క టీడీలోనే కొన‌సాగుతూ.. మ‌రోప‌క్క ప్రతిప‌క్ష నేత‌ల‌తో `ట‌చ్‌`లో ఉంటూ క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌ట‌. అయితే ఆయ‌న మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముంద‌కు వెళుతున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రావెల కిషోర్‌బాబు మంత్రి ప‌ద‌వి ఊడ‌బీకేసిన విష‌యం తెలిసిందే! ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఉన్నాయి. వీటిని ప‌సిగ‌ట్టిన ఆయ‌న‌.. ఇక వైసీపీలో చేరేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. పార్టీ వేటు వేసే సంకేతాలు కూడా ఉండ‌టంతో ఈలోగా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న బ‌లం పెంచుకునే ప్ర‌య‌త్నాల్లో బిజీ బిజీగా ఉన్నార‌ట‌.

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలిసారే మంత్రి పద‌వి పొందిన ఆయ‌న‌.. త‌న వ్య‌వ‌హార శైలితో అధిష్ఠానానికి త‌ల‌నొప్పులు తీసుకొచ్చారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని నేత‌ల‌ను పట్టించుకోక‌పోవ‌డం.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో ట‌చ్‌లో ఉండ‌టంతో గుర్రుగా ఉన్న టీడీపీ అధినేత‌.. ఆయ‌న‌పై వేటు వేశారు. ఇదే సమ‌యంలో ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. ప్ర‌స్తుతం ఆయనపై టీడీపీ అధిష్టానం వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు త‌న ప‌ని తాను చాప కింద నీరులా చేసుకుపోతున్నార‌ట‌.

ఇటీవ‌ల నియోజకవర్గంలో రాజ‌కీయ‌ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కక పోయినా వైసీపీ గూటికి చేరి విజయం సాధించేందుకు ఆయన ఇప్పటి నుంచే పత్తిపాడు నియోజకవర్గంలో ఓటు బ్యాంకును స్ట్రాంగ్ చేసుకున్నట్లు కన్పిస్తోంది. ఎమ్మెల్యేగా తన పరిధిలోని ఉన్న వాటిని వైసీపీ శ్రేణులకే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చేందుకు రావెల ప్రయత్నిస్తున్నార‌ట‌. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కూడా రావెల దగ్గరుండి చూస్తున్నార‌ట. రావెల వ్యవహార శైలి నచ్చకపోవడంతో త్వరలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా బుధవారం రావెల కిశోర్ బాబు నియోజకవర్గంలో జరిగిన ఘటన కూడా ఇందుకు బ‌లం చేకూర్చుతోంది. రావెల పిలుపు మేరకు పత్తిపాడు నియోజకవర్గాన్ని మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సందర్శించారు. పత్తిపాడు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా ఒక్కటై మంత్రి అయ్యన్నపాత్రుడు టూర్ ను అడ్డుకున్నారు. రావెల తీరును నిరసిస్తూ అయ్యన్న కాన్వాయ్ ను కదలకుండా నిల‌పివేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాల‌ని అయ్యన్న డిసైడ్ అయ్యార‌ట‌. ఈ ప‌రిణామాల‌న్నీ ప‌రిశీలిస్తే రావెల రేపో మాపో.. ఇక వైసీపీలో చేరిపోతార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది!!