చంద్ర‌బాబు విందు చాలా కాస్ట్లీ గురూ..!

నిధుల లేమితో ఖ‌జానా క‌ట‌క‌ట‌లాడుతోంది! అయినా.. ఆయ‌న ఖ‌ర్చులు మాత్రం త‌గ్గ‌డం లేదు!! ఆర్థిక ప‌రిస్థితి మాటల్లో వ‌ర్ణించ‌లేనంత దారుణంగా ఉంది! అయినా.. ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌ల‌నకు వెళ్ల‌డం మాన‌లేదు!! లోటు బ‌డ్జెట్ మ‌రో ప‌క్క వెక్కిరిస్తోంది! అయినా.. అయ‌న చేతికి ఎముకే లేదు!! అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత శంకుస్థాప‌న‌లు, విదేశీ టూర్లు, క‌ళ్లు చెదిరే రీతిలో హంగులు, ఆర్భాటాలు.. స్వ‌ల్పంగా చెప్పాలంటే ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి వ్య‌వ‌హార శైలి! ఇప్పుడు మ‌రోసారి తానెంత `హైటెక్‌` ముఖ్య‌మంత్రో ఆయ‌న నిరూపించారు. మొత్తం 18 మందికి ఒక రాత్రి విందు ఖ‌ర్చు తెలిస్తే నెరెళ్ల‌బెట్టాల్సిందే!! అదెంతంటే అక్ష‌రాలా రూ.18 ల‌క్ష‌లు!!

`రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉంది. నిధుల లేమితో క‌ట‌క‌ట‌లాడుతోంది. ఆర్థిక ప‌రిస్థితి అంతంత‌మాత్రంగానే ఉంది` అని సీఎం చంద్ర‌బాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే ఆయ‌న మాటలు ఇలా ఉంటే.. చేత‌లు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంద‌రినీ ఖ‌ర్చులు తగ్గించుకోమని చెబుతున్న ఆయ‌న‌.. తాను మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదు! త‌న దుబారాకు మాత్రం అడ్డు వేయ‌లేక‌పోతున్నారు. ఇప్పుడు వాళ్లందరూ జడ్జిలు. ఇతర ప్రముఖులు. వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రాత్రి విందు ఇచ్చారు. అందులో ఏమాత్రం ఆశ్చ‌ర్యం లేదు. కానీ ఆ విందుకు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా?. అక్షరాలా 18.29 లక్షల రూపాయలు.

ఒక్క విందు కోసం 13, 38,720 రూపాయలు ఖర్చు పెట్టగా.. ఆ 19 మంది ప్రముఖులు కూర్చునే ప్లేస్.. డెకరేషన్ కోసం 4,90,705 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డెకరేషన్ లో ఏమున్నాయి అంటే సోఫాల ఏర్పాటు, డయాస్, పూలతో అలంకరణ, మైక్ లు తదితర అంశాలు. ఏమి తిన్నా కూడా ఓ ఇరవైమంది భోజనం ఖర్చు 13 లక్షల రూపాయలు అవుతుందా? అసలే ఏపీ సర్కారు లోటు బడ్జెట్ తో ఉందని..పైసా పైసా కూడబెట్టుకుని పనిచేస్తున్నామని..చెప్పే సర్కారు కేవలం ఇరవై మందికి విందు ఇచ్చేందుకు సర్కారు సొమ్మును ఏకంగా 18 లక్షల రూపాయలు ఖర్చు చేయటం విచిత్రం.

రాష్ట్రానికి వచ్చిన అతిధులకు విందు ఇవ్వటాన్ని ఎవరూ ఆక్షేపించరు. కానీ అందుకు పెట్టిన ఖర్చే అసలు విషయం. విషయం ఏమిటంటే ప్రభుత్వంలోని పెద్దలు తమ వరకూ వచ్చేసరికి ప్రత్యేక విమానాలు దగ్గర నుంచి ఎక్కడా `స్టార్` సౌకర్యాల‌కు లోటు లేకుండా చూసుకుంటున్నారు. నిత్యం నిధుల గురించి ప్రస్తావించే చంద్ర‌బాబు.. తాను చేసే దుబారా వ్యయాన్ని అరికడితే అది మరింత బాగా చేయవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.