రేవంత్ స్టాండ్ మార్చుకున్నాడా?

తెలంగాణ టీడీపీ నేత‌ల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రూటు మారుతోందా? పొలిటిక‌ల్‌గా ఆయ‌న స్టాండ్ ఏమిటి? వంటి ప‌లు అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరే! టీఆర్ ఎస్‌పై రేవంత్ ఎలా రెచ్చిపోతాడో అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, ఆట మొద‌లైంది అంటూ.. అప్ప‌ట్లో ఓటుకు నోటు కేసులో జైలు నుంచి వ‌చ్చాక చేసిన స‌వాలు కూడా అంద‌రికీ గుర్తింది. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు మారిపోయింది. ఒక్క‌సారిగా ఆయ‌న పొలిటిక‌ల్‌గా పెద్ద ట‌ర్నింగ్ ఇచ్చేశారు.

భ‌ద్రాచ‌లంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇప్పుడు రేవంత్ ను ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదు. అదేంటంటే.. ఇక్క‌డి ఓ పేప‌ర్ మిల్లులో కార్మిక సంఘాల ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు రేవంత్ వెళ్లారు. కార్మిక విభాగం టీఎన్టీయూసీకి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తోంది. దీంతోపాటు తెరాస‌, వైసీపీలు కూడా ఆ విభాగానికే స‌పోర్ట్ చెయ్య‌డం విశేషం. ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ ప్ర‌చారం చేశారు. ఎలా అంటే.. రేవంత్ రెడ్డికి ఒక‌ప‌క్క తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన నాయ‌కుడు.. మ‌రోప‌క్క వైయ‌స్సార్ సీపీ నాయ‌కుడు ప్రచారంలో పాల్గొన్నారు.

రెండు పార్టీల నేత‌ల మ‌ధ్యా ప‌సుపు కండువా క‌ప్పుకుని రేవంత్ ప్ర‌చారం చేయ‌డం సీన్ చూసిన‌వారంతా విచిత్రంగా ఫీల‌య్యారు. రేవంత్ రెడ్డికి కూడా ఈ అనుభ‌వం కాస్త చిత్రంగానే అనిపించింది! కానీ, త‌ప్ప‌ని ప‌రిస్థితి అన్న‌ట్టుగా ప్ర‌చారం చేశారు. నిజానికి ఏపీలో జ‌గ‌న్ పార్టీతో టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌తోనూ పోరాటం చేస్తోంది. అయితే, అనూహ్యంగా ఈ రెండు పార్టీల‌తోనూ క‌లిసి రేవంత్ కార్మిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. రేవంత్ ఏమైనా స్టాండ్ మార్చుకున్నాడా? అని అంద‌రూ అనుకున్నారు. అయితే, అలాంటిదేమీ లేద‌ని రేవంత్ స‌న్నిహితులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.