చంద్ర‌బాబుకు, ఆ సీనియ‌ర్ ఎమ్మెల్సీకి ప‌డ‌ట్లేదా..!

టీడీపీలో ఓ సీనియ‌ర్ ఎమ్మెల్సీకి, సీఎం చంద్ర‌బాబుకు అస్స‌లు ప‌డట్లేదా ? చంద్రబాబు తీరుపై విసిగిపోయిన స‌ద‌రు సీనియ‌ర్ నేత రాజ‌కీయాల‌ను గుడ్ బై చెప్పేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు అంద‌రికి సుప‌రిచితుడే. గ‌త ఎన్నిక‌ల్లో గాలి న‌గ‌రి నుంచి పోటీ చేసి రోజా చేతిలో కేవ‌లం 926 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ త‌ర్వాత బాబు ఆయ‌న సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే 2004లో కాంగ్రెస్ నుంచి, 2009లో టీడీపీ నుంచి రెండుసార్లు వ‌రుస‌గా గెలిచినా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేదు. ఈ సారి టీడీపీ అధికారంలో ఉన్నా త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ప్ర‌క్షాళ‌న‌లో చంద్ర‌బాబు గాలిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. జిల్లా నుంచే త‌న త‌న‌యుడు లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవ‌డంతో గాలి ఆశ‌లు ఆవిర‌య్యాయి.

ఇక ఎమ్మెల్సీగాను అటు స్టేట్‌లో కాదు క‌దా…కనీసం జిల్లాలోను ఆయ‌న‌కు ప్ర‌యారిటీ ఉండ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని చంద్రబాబుకు చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆర్థిక‌స్థోమ‌త లేద‌ని… నగరిలో మరొక నేతను చూసుకోవాలని ఆయన ముందుగానే చెప్పారట. దీంతో పార్టీ హైకమాండ్ నగిరి నియోజకవర్గలో ధీటైన నేత కోసం అన్వేషణను ప్రారంభించింది.

లోకేశ్ మాత్రం న‌గ‌రిలో గాలి అయితోనే స‌మ‌ర్థుడైన వ్య‌క్తి అవుతాడ‌ని భావిస్తున్నార‌ట‌. రోజాను ధీటుగా ఎదుర్కొనాలంటే గాలి వల్లనే సాధ్యమవుతుందని భావిస్తోన్న లోకేశ్ ఇక్క‌డ ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేయాల‌ని గాలిని రిక్వెస్ట్ కూడా చేశార‌ట‌. గాలి కొడుక్కి టిక్కెట్ వస్తుంద‌న్న సూచ‌న‌లు లేక‌పోవ‌డంతో ఆయ‌న మ‌రింత ఆవేద‌న‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఆయ‌న రాజ‌కీయాల నుంచి తప్పుకుంటాన‌ని ప్ర‌క‌ట‌న చేస్తున్నార‌ని టాక్‌.

ఇదిలా ఉంటే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ రేసులో కొత్త పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. తిరుమల జేఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు మరో ఏడాదిలో తెలుగుదేశంపార్టీలోకి చేర‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. అంతేగాక‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయ‌న బాబును కాకా ప‌డుతున్నార‌ని కూడా తెలుస్తోంది.