చంద్ర‌బాబు తీరుతో నేత‌ల్లో ఆందోళ‌న‌

పార్టీ కోసం ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయిస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నా.. ఆచ‌ర‌ణ‌లో మాత్రం వాటిని ప‌ట్టించుకోవ‌డం లేదా? సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఏర్ప‌డుతున్న జాప్యం వ‌ల్ల పార్టీకి కొంత న‌ష్టం క‌లుగుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. పార్టీ శ్రేణుల్లో ఈ అంశాలపై విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత‌.. పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంద‌ని, దీని నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోని పక్షంలో పార్టీకి న‌ష్టం క‌లుగుతుందనే ప్ర‌చారం శ్రేణుల్లో వినిపిస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ నుంచి సీటు ఆశించిన శిల్పా… వైకాపాలో చేరిపోయారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ సీటు కోసం భూమా అఖిల వ‌ర్గంతోపాటు, శిల్పా వ‌ర్గం కూడా పోటి ప‌డింది. శిల్పాకే సీటు అన్న‌ట్టుగా మొద‌ట్నుంచీ సంకేతాలు ఇస్తూ వ‌చ్చారు సీఎం చంద్ర‌బాబు! టిక్కెట్టు కేటాయింపుపై ఆయ‌న‌ నాన్చివేత వైఖ‌రి కూడా పార్టీకి శిల్పా గుడ్ బై చెప్పేందుకు కార‌ణ‌మ‌ని టీడీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. పార్టీ గురించి ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నీ, ఆయ‌న వైఖ‌రి వ‌ల్ల‌నే శిల్పా వెళ్లిపోయార‌నీ, ఇది ఇక్క‌డితో ఆగక‌పోవ‌చ్చ‌నే ఆందోళ‌న కొంత‌మంది నేత‌ల్లో వ్య‌క్త‌మౌతోంది.

నంద్యాల అభ్య‌ర్థిపై అమెరికా నుంచి వ‌చ్చిన వెంట‌నే ఒక ప్ర‌క‌ట‌న చేసి ఉంటే ప‌రిస్థితి ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చేది కాద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. పార్టీ కోసం ఎంతో స‌మ‌యం కేటాయిస్తున్నా అని చెబుతున్న చంద్ర‌బాబు.. ఈ మ‌ధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు. పార్టీకి సంబంధించిన కీల‌క అంశాల‌ను పెండింగుల్లో పెట్టేస్తున్నార‌ని అభిప్రాయ‌డుతున్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఇంత‌వ‌ర‌కూ ఏదీ తేల్చ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో వ‌చ్చే ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను కూడా ఇంతవ‌ర‌కూ ఎంపిక చెయ్య‌లేదు. జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌దువుల్ని కూడా ఇంకా ఖ‌రారు చెయ్య‌లేద‌ని గుర్తుచేస్తున్నారు.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌రువాత కొంత‌మంది టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్నుంచే ప‌రిస్థితి గాడి త‌ప్పింద‌ని, ఇప్ప‌టికీ కొంత‌మంది నేత‌ల్లో అసంతృప్తి అలానే ఉంద‌నే చ‌ర్చ కూడా పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. చంద్ర‌బాబు ధోర‌ణి ఇలానే కొన‌సాగితే పార్టీకి ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉందని విశ్లేషిస్తున్నారు. శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీ వీడ‌టాన్ని చంద్ర‌బాబు లైట్ గా తీసుకుంటున్నార‌నీ, కానీ ఇలాంటివి ఇక్క‌డితో ఆగాలంటే పార్టీ గురించి చంద్ర‌బాబు చాలా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయాన్ని సీనియ‌ర్లు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా నాన్చివేత ధోర‌ణి వ‌దలాల‌ని సూచిస్తున్నారు.