సీబీఐ ద‌ర్యాప్తుకి `నో` వెనుక రీజ‌న్ ఇదేనా?

ఏదైనా కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డినా, ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వెంట‌నే `సీబీఐకి కేసు అప్ప‌గించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ఎంత మొత్తుకున్నా.. ఎంత గంద‌ర‌గోళం సృష్టించినా.. వాటన్నింటినీ ఏమాత్రం ఖాత‌రు చేయ‌రు తెలంగాణ సీఎం కేసీఆర్.

మొన్న‌టికి మొన్న ఓటుకు నోటు కేసులో, గ్యాంగ్ స్టార్ న‌యీం కేసులోనూ స‌రిగ్గా ఇదే జ‌రిగింది. ఇప్పుడు మియాపూర్ భూకుంభకోణం లోనూ కేసీఆర్ దీనినే ఫాలో అవుతున్నారు. కేసును సీబీఐకి అప్ప‌గించ‌కుండా ఆ వివ‌రాల‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచుకోవ‌డం వెనుక వ్యూహం వేరే ఉంద‌ని పార్టీలో గుసగుస‌లు వినిపిస్తున్నాయి. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో ఆ కేసుల్లో ఇరుక్కున్న వారిని త‌న దారికి తెచ్చుకునేందుకు వీటిని ఉప‌యోగించ‌బోతున్నార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

మియాపూర్ భూకుంభ‌కోణం ఇప్పుడు తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడైన కాంగ్రెస్ నేత పాటు టీఆర్ఎస్ నేత కేకే కూడా ఇరుక్కున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ భూముల విష‌యంలో ఎక్క‌డా ఎలాంటి కుంభ‌కోణాలు లేవ‌ని కేసీఆర్‌ స్వ‌యంగా ప్ర‌క‌టించినా.. రాజ‌కీయంగా దూర‌దృష్టితో ఆలోచించే ఇలా ప్ర‌క‌టించారని అంతా విశ్లేషిస్తున్నారు. ఈ భూముల రిజిస్ట్రేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యించ‌డంతో కేకే కూడా స‌రెండ‌ర్ అయిపోయిన‌ట్టే! కోర్టుకు కూడా వెళ్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్లే!

ఈ నేప‌థ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం హ‌ఫీజ్ పురా గ్రామంలో కొనుగోలు చేసిన భూముల‌ను కూడా వ‌దులుకునేందుకు కేశ‌వ‌రావు సిద్ధ‌ప‌డ్డ‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ వ్య‌వ‌హారంలో కేసీఆర్ త‌గ్గేలా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆయ‌నే ఒక మెట్టుదిగి రావాల్సి వ‌చ్చింది. ఇక‌, కేసీఆర్ కు బాగా ద‌గ్గ‌ర‌గా ఉంటున్న ఓ కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుడి ఫ్యామిలీతోపాటు ప‌లువురు నేత‌ల భూభాగోతాలు ఆయ‌న‌ ద‌గ్గ‌ర‌కు ఒక ఫైల్ రూపంలో చేరాయ‌ట‌! అయితే, వారి పేర్లు ఇప్పుడే బ‌య‌ట‌కుపెట్టే ఆలోచ‌న‌లో కేసీఆర్ లేక‌పోవ‌డానికి కార‌ణముంద‌ట‌. రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒక‌లానే ఉండ‌క‌పోవ‌చ్చు క‌దా!

ఆ నేత‌లు ఎవ‌రైనా తోకజాడించే స‌మ‌యాల్లో స‌రిగ్గా ఈ ఫైళ్లూ బ‌య‌ట‌కి తీసి.. ఆ వివ‌రాల‌ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చెయ్యొచ్చ‌నేదే కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ అనే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు అంటూ కేసీఆర్ హ‌డావుడి చేయ‌లేద‌నీ, పోయిపోయి కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు చేతికి ఈ అస్త్రాన్ని అంద‌జేసేంత అమాయ‌క‌పు ప‌ని కేసీఆర్ ఎందుకు చేస్తార‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని త‌న చేతిలోనే పెట్టుకుని.. త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు.