టీఆరెస్ మంత్రులకు పాతవి బోర్ కొట్టాయా లేక భయం పట్టుకుందా!

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్ప‌టి నుంచే ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ సెంటిమెంట్ ప‌నిచేసింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ప‌రిస్థితి లేదు. కేవ‌లం అభివృద్ధి, అభ్య‌ర్థుల ప‌నితీరు ఆధారంగానే గెలుపోట‌ములు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు కేసీఆర్ స‌ర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎక్క‌డో చిన్న అనుమానం ఉండ‌డంతో వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకునే ప‌నిలో బిజీ అయ్యారు.

ఈ ముగ్గురు మంత్రులు గ్రేట‌ర్‌లోని నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే దృష్టి సారిస్తుండ‌డం కూడా విశేషం. ఈ వ‌రుస‌లో మంత్రి కేటీఆర్ ముందు ఉన్నారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా గ్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే బ‌రిలోకి దిగ‌నున్నారు. సిరిసిల్ల‌లో ఆయ‌న‌కు 91 మార్కులు వ‌చ్చాయి. అయినా అక్క‌డ గెలుపుపై ఆయ‌న‌కు డౌట్ ఉంద‌ట‌. సిరిసిల్ల రూర‌ల్ ఏరియా, అక్క‌డ నిత్యం ప‌ర్య‌టించాలి. చేనేత కార్మికుల స‌మ‌స్య‌లు కేటీఆర్‌కు మైన‌స్‌గా మారాయి. దీంతో ఆయ‌న అక్క‌డ వ‌రుస‌గా మూడుసార్లు గెలిచినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గ్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు.

ఈ జాబితాలో ముందుగా ముందుగా జూబ్లిహిల్స్‌, ఖైర‌తాబాద్, కూక‌ట్‌ప‌ల్లి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు శివారు ప్రాంతంలో ఉన్న ఉప్ప‌ల్ అయితే సేఫ్ అని భావిస్తున్నార‌ట‌. అక్కడ వ‌రంగ‌ల్ నుంచి వ‌చ్చిన సెటిల‌ర్స్ ఎక్కువుగా ఉన్నారు. ఇక ర‌వాణా శాఖా మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారిస్తున్నారు. ఆయ‌న తాండూరులో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. ఇక్క‌డ ఇటీవ‌ల మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా కోల్పోవ‌డం ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌.

ఇక మ‌రో మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం స‌ర్వేలో ఆయ‌న‌కు చాలా త‌క్కువ మార్కులు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మారాల‌ని చూస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల నుంచి కూడా ఆయ‌న తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయ‌న న‌ల్గొండ జిల్లా సెటిల‌ర్స్ ఎక్కువుగా ఉన్న ఎల్బీన‌గ‌ర్ మీద క‌న్నేశారు. ఏదేమైనా కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు గ్రేట‌ర్ బ‌రిలో నుంచి పోటీ చేయాల‌ని ఆస‌క్తి చూప‌డం టీ పాలిటిక్స్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.