విశాఖ‌పై బీజేపీ క‌న్ను! 

విశాఖ‌.. ఏపీలోని అత్యంత సుంద‌ర‌మైన టూరిస్ట్ ప్లేస్‌. అంతేకాదు… కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన అనేక పెద్ద పెద్ద ఇండ‌స్ట్రీలు ఇక్క‌డే ఉన్నాయి. అంతేకాకుండా విశాఖ విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా, న‌గ‌రాన్ని ప్ర‌ఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా తీర్చి దిద్దుతున్నారు. దీంతో ఇప్పుడు క‌మ‌ల ద‌ళాధిప‌తుల‌కు ఉక్కు న‌గ‌రంపై మిక్కిలి ప్రేమ ఒలికిపోతోంది! త‌మ‌కు ఏపీలో అత్యంత క‌లిసొచ్చే న‌గ‌రం ఏదైనా ఉంటుందంటే అది విశాఖే న‌ని వాళ్లు చెప్పుకొంటున్నారంట‌!

ఈ నేప‌థ్యంలో మొన్న తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా.. విశాఖ గురించి ప్ర‌స్తావించారు. జూలైలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ‌కు వ‌స్తున్నార‌ని, ఆయ‌న మంగ‌ళ హార‌తులు ప‌ట్టాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దీంతోనే విశాఖ‌కు బీజేపీ ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్ధ‌మైపోతోంది! నిజానికి రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతంగా విజ‌య‌వాడ‌కే ప్ర‌ముఖులు వ‌స్తున్నారు. కానీ, ప్ర‌ధాని మోడీ విశాఖ‌ను ఎంచుకోవ‌డంలోనే వాళ్ల వ్యూహం అర్ధ‌మైపోతోంది.

నిజానికి విశాఖ‌లో ఏపీ వాళ్ల‌తోపాటు ఉత్త‌రాది వాళ్లు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. ఉత్త‌రాది వాళ్ల‌కి షా, మోడీ ద్వ‌యం అంటే తెలియ‌నివారు లేరు. దీంతో ఇటు ఏపీ వాళ్ల‌ని, అటు ఉత్త‌రాది వాళ్ల‌ని ఒకే టైంలో ఆక‌ట్టుకోవ‌డం వ‌ల్ల కాషాయ జెండాని శాశ్వ‌తంగా ఎగ‌ర‌వేయొచ్చ‌ని షా, మోడీ ద్వ‌యం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక్క‌డి నౌకా సిబ్బంది స‌హా కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేస్తున్న వేల మంది ఉత్త‌రాది వారు విశాఖ‌లో ఉంటున్నారు. వీరిని ఆక‌ట్టుకుని… ఇక్క‌డ విశాఖ‌లో పాగా వేయాల‌ని బీజేపీ వ్యూహం ర‌చించిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే విశాఖ ఎంపీగా పార్టీ సీనియ‌ర్ నేత హ‌రిబాబు ఉండ‌డం క‌లిసొచ్చే అంశం అంటున్నారు. మ‌రి మున్ముందు మోడీ, షా ద్వ‌యం ఇంకెలాంటి వ్యూహాలు వేస్తారో చూడాలి!!