ల‌గ‌డ‌పాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!

ద‌శాబ్దం పాటు ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ గ‌త ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డంతో రాజ‌కీయాల‌పై విర‌క్తితో ఆయ‌న వాటికి దూర‌మ‌య్యారు. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్‌. అటు జాతీయ‌స్థాయిలోను స‌త్తా చాటారు. మీడియాలో ఎక్క‌డ చూసినా ల‌గ‌డ‌పాటి హంగామా చాలా ఎక్కువ‌గానే ఉండేది. అలాంటి ల‌గ‌డ‌పాటి వాయిస్ ఇప్పుడు చాలా త‌క్కువుగా మాత్ర‌మే వినిపిస్తోంది.

స‌ర్వేల మేథావి, రాజ‌కీయం రుచి తెలిసిన వాడు మ‌రి మ‌నోడు వాటికి ఎలా దూరంగా ఉంటాడు ? ఉండ‌లేడు క‌దా..! అందుకే మ‌నోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం ల‌గ‌డ‌పాటి వైసీపీలో చేరుతున్నార‌ని..ఆయ‌న కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి దేవినేని ఉమా మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం ఇలా ఉండ‌గానే ల‌గ‌డ‌పాటి స‌చివాల‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును క‌లిశారు.

దీంతో ల‌గ‌డ‌పాటి రూటు టీడీపీ వైపు ఉంద‌ని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయ‌న మ‌న‌సు ఏ పార్టీ వైపు ఉందో తెలియ‌కపోయినా ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ వార్త‌లు మాత్రం జోరుగానే వినిపిస్తున్నాయి. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో శ‌నివారం త‌న అనుచ‌రుల‌తో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో ఆయ‌న 2019లో తాను తిరిగి పోటీ చేస్తాన‌న్న సంకేతాలు ఇచ్చేశార‌ని తెలుస్తోంది.

ల‌గ‌డ‌పాటి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చినా ఆయ‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీ టీడీపీ నుంచి ఉంటుందా లేదా వైసీపీ నుంచా ? అన్న‌ది చూడాలి. ఆయ‌న ఎంపీగా పోటీ చేస్తాడా ? లేదా ఎమ్మెల్యేగా బ‌రిలో ఉంటాడా ? అన్న‌ది చూడాలి.