నంద్యాల‌లో కాంగ్రెస్ టార్గెట్ ఎవ‌రు?

విభ‌జ‌న త‌ర్వాత‌ ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన స‌మ‌యంలో ఉనికి చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. వీలైనంత వ‌రకూ పోటీలో నిలిచి అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తోంది! ఇప్పుడు ఆ స‌మయం వ‌చ్చింద‌ని భావిస్తోంది. నంద్యాల ఎన్నిక‌ల‌ను స‌రైన వేదిక‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్ర‌స్తుతం నంద్యాల‌లో అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ బ‌రిలోనే నిలుస్తుండ‌గా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెల‌వ‌క‌పోయినా.. కొన్ని ఓట్లు అయినా సాధించ‌వ‌చ్చ‌ని, ఇది త‌మ విజ‌యావకాశాల‌ను దెబ్బ‌కొట్టే అవ‌కాశ‌ముంద‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్ని అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. చంద్ర‌బాబు స‌ర్కారుపై ప్ర‌జా వ్య‌తిరేక‌తకు ఈ ఎన్నికే రెఫ‌రెండ‌మ్ అవుతుంద‌ని వైకాపా భావిస్తుండ‌గా.. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి 2019 ఎన్నిక‌ల్లో దూసుకుపోవాల‌ని టీడీపీ నిశ్చ‌యించుకుంది. దీంతో ట‌గ్ ఆఫ్ ఫైట్‌గా మార‌బోతోంద‌ని విశ్లేష‌కులు కూడా డిసైడ్ అయిపోయారు. అయితే ఇంత‌వ‌ర‌కూ ద్విముఖం అనుకున్న నంద్యాల ఉప ఎన్నిక‌.. ఇప్పుడు త్రిముఖంగా మార‌బోతోంది! టీడీపీ, వైసీపీనేకాదు.. మేమూ సిద్ధంగా బరిలోనే ఉన్నామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. నంద్యాల‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థిని పోటీకి దింప‌బోతున్న‌ట్లు ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి వెల్ల‌డించారు.

2014లో నంద్యాల కాంగ్రెస్ అభ్య‌ర్థిగా జూప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌రిలోకి దిగారు. ఆయ‌న‌కి కేవ‌లం 2,459 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇలాంటి గ‌తానుభం ఉండి కూడా ఏ ధైర్యంతో మ‌ళ్లీ పోటికి దిగుతోందీ అనేది అంతుచిక్క‌నిప్ర‌శ్న‌! అయితే వీరి లెక్క ఏంటంటే.. నంద్యాల‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితిలు మారాయ‌నీ, కాంగ్రెస్ కు లాభించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌న్న‌ది ర‌ఘువీరా ధీమా. వైకాపాపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం లేద‌నేది భావిస్తున్నారు. ఈ మ‌ధ్య జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీని క‌లిసిన త‌ర్వాత ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లో కొంత మార్పు వ‌చ్చింద‌ని కాంగ్రెస్ న‌మ్ముతోంది. భాజ‌పాకి జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవుతూ ఉండ‌టం వ‌ల్ల‌… మైనారిటీలు, ద‌ళితులు వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు.

ఇక టీడీపీపైనా ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పోయింద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. మూడేళ్లుగా రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, అంతా అమ‌రావ‌తిలోనే ఉండ‌టం, ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్ వంటి అంశాల్లో టీడీపీ వైఖ‌రిపై ప్ర‌జ‌లు విసుగుచెందార‌ని ధీమా వ్య‌క్తంచేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గుతార‌నేది వారి న‌మ్మ‌కం. మైనారిటీ లేదా రెడ్డి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడికి టిక్కెట్ ఇవ్వాల‌నేది కాంగ్రెస్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. కాంగ్రెస్ పూర్తిగా గెల‌వ‌క‌పోయినా కొన్ని ఓట్ల‌ను మాత్రం చీల్చ‌డం మాత్రం ఖాయం! మ‌రి టీడీపీ, వైసీపీలో ఎవ‌రి ఓట్ల‌కు దెబ్బ‌కొడుతుందో వేచిచూడాల్సిందే!!