క‌ట్టు త‌ప్పుతోన్న త‌మ్ముళ్లు….ప‌ట్టు కోల్పోయిన బాబు

టీడీపీ.. ఏపీలో రాజ‌కీయ సంచ‌ల‌నం సృష్టించిన దాదాపు 36 ఏళ్ల న‌వ య‌వ్వ‌నంలో ఉన్న పొలిటిక‌ల్ పార్టీ. దీనిని మ‌రిన్ని ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉండేలా అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అధికారం శాశ్వ‌తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కిచెప్పారు. ఇది బాగానే ఉన్నా.. ఆ ప‌రిస్థితి ఎక్కడో ప‌ట్టుత‌ప్పుతున్న‌ట్టే క‌నిపిస్తోంది! టీడీపీ అధినేత ఆశ‌ల‌కు.. త‌మ్ముళ్ల ప్ర‌వ‌ర్త‌న‌కు ఎక్క‌డా పోలిక ఉండ‌డం లేదు.

ఎక్క‌డిక‌క్క‌డ త‌మ్ముళ్ల ఆగ‌డాలు, దందాలు మితిమీరిపోతున్నాయి. దీంతో అధినేత చెప్పేది ఒక‌టి.. త‌మ్ముళ్లు చేసేది మ‌రోటి.. అన్న విధంగా టీడీపీ వ్య‌వ‌హార శైలి ఉండ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. నిజానికి ఇటీవ‌ల కాలంలో తాను అవినీతిని సహించేది లేద‌ని, అవినీతి ప‌రుల‌ను ప‌క్క‌న చేర్చుకునేది కూడా లేద‌ని బాబు ప‌దే ప‌దే చెప్పారు. దీనికిగాను 1100 టోల్ ఫ్రీనెంబ‌ర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

చిన్నా చిత‌కా.. లంచాలు పుచ్చుకున్న వారిని ప‌ట్టుకుని తిరిగి ఆ సొమ్మును రాబ‌డుతున్నారు కూడా. అయితే, అస‌లు దొంగ‌లు టీడీపీలోనే ఉన్నార‌ని అంటున్నారు విప‌క్ష వైసీపీ నేత‌లు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో వెలుగు చూసిన విశాఖ భూ క‌బ్జా… హైద‌రాబాద్ భూ క‌బ్జా వంటి కేసుల‌ను వారు చూపిస్తున్నారు. హైద‌రాబాద్ కేసులో అయితే ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేశారు కూడా. అదేవిధంగా విశాఖ భూ క‌బ్జా కేసుపై ఇప్ప‌టికే క‌లెక్ట‌ర్ నివేదిక సీఎం పేషీకి కూడా చేరింది. దీనికితోడు సొంత పార్టీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కూడా భూ క‌బ్జాపై మీడియాకు ఎక్కేశారు.

ఇంత జ‌రుగుతున్నా.. అటు త‌మ్ముళ్ల‌లో కానీ, ఇటు టీడీపీ అధినేత‌లో కానీ.. సొంతింటిని చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఆలోచ‌నే క‌నిపించ‌డం లేదు. దీంతో వైసీపీ నేత‌లు మ‌రింత రెచ్చిపోతున్నారు. ఈ క్ర‌మంలో స్పందించాల్సిన సీఎం మౌనంగా ఉన్నారు. ఇక‌, క‌ర్నూలులో త‌మ్ముళ్లు రోడ్డుమీదకెక్కి త‌న్నుకున్నారు. అదేవిధంగా అనంత‌పురంలో హ‌త్యారాజ‌కీయాలు ష‌రా మామూల‌య్యాయి. వీట‌న్నింటిలోనూ టీడీపీ త‌మ్ముళ్ల హ‌స్తం ఉంద‌ని ఆరోప‌ణ‌లున్నాయి.

అయిన‌ప్ప‌టికీ బాబు మౌనం వ‌హిస్తున్నారంటే.. త‌ప్పు ఎవ‌రిలో ఉంద‌నుకోవాలి? ఆయ‌న మాట‌ను నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భావించాలా? లేక‌.. టీడీపీ అధికారంలో ఉందికాబ‌ట్టి.. ఏం చేసినా చెల్లుతుంద‌ని బాబు అనుకుంటున్నారా? ఏదేమైనా.. రాబోయే ఎన్నిక‌ల్లో ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే టీడీపీకి చేదు అనుభ‌వం త‌ప్ప‌ద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.