2019లో తార‌క్ ప్ర‌చారంతోనే టీడీపీ బ‌రిలోకి…

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయ‌నేది ఎవ్వ‌రూ చెప్ప‌లేని విష‌యం. ముఖ్యంగా పొత్తులు అయితే మ‌రీను. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు లేని రంగం ఒక్క పాలిటిక్సే. నిన్నటికి నిన్న అమ్మ‌నా బూతులు తిట్టుకున్న నేత‌లు సైతం అవ‌స‌రం వ‌చ్చిందంటే.. వాటేసుకుని ముద్దులు కుమ్మ‌రించేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అందునా అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో ఇలాంటి మామూలే!! ఇప్ప‌డు ఇదంతా ఎందుకంటే.. ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితి రానున్న రోజుల్లో అత్యంత ర‌మ‌ణీయంగా మారిపోయే ప‌రిస్థితి క‌నిపిస్తోందికాబ‌ట్టి!!

ఇప్పుడున్న ట్రెండ్‌లో ఎన్ని మంచి ప‌నులు చేసినా.. ప‌ట్టించుకుని ప‌ట్టంక‌ట్టే ప‌రిస్థితి లేదు. అందుకే ఎంతటి ఉద్ధండ పార్టీ అయినా.. మ‌రో పార్టీపై లేదా వ్య‌క్తుల‌పై ఆధార‌ప‌డాల్సిన‌ ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. 2014 ఎన్నిక‌లే దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. టీడీపీ బీజేపీల కూట‌మి.. ప‌వ‌న్ పై డిపెండ్ కావాల్సి వ‌చ్చింది. మ‌రి ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. తిరిగి ఎన్నిక‌లు అనివార్యం. 2019లో ప‌రిస్థితి ఏంటి? అంటే.. ప‌రిస్థితి మొత్తం రివ‌ర్స్‌!

ఇప్పుడు దోస్తులుగా ఉన్న ప‌వ‌న్ టీడీపీల మ‌ధ్య హోదా విష‌యంలో విభేదాలు వ‌చ్చాయి. పైకి న‌ర్మ‌గ‌ర్భంగా ఇరు ప‌క్షాలూ ఉన్న‌ప్ప‌టికీ.. 2019లో హోదానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ అజెండా కాబోతోంది. అదేస‌మ‌యంలో టీడీపీ హోదాను వ్య‌తిరేకిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో టీడీపీకి బ‌ల‌మైన ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న మాస్ నేత ఒక‌రు కావాలి. ఈ సంద‌ర్భంగానే మ‌రోసారి.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న ఇప్పుడు తెర‌మీద‌కి వ‌చ్చింది.

వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీతోకి అండగా తీసుకొచ్చి, అతన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటే కొంత వరకైనా పవన్ కళ్యాణ్ మానియాని తట్టుకొని నిలబడే అవకాశం వుందని, అలాగే బీజేపీతో పొత్తు, తారక్ ప్రచారం రెండు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని చంద్ర‌బాబుకి కొంద‌రు చెప్పిన‌ట్టు స‌మాచారం. అయితే, ఇది వ‌ర్క‌వుట్ అవుతుందా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.

2009 ఎన్నిక‌ల ప్ర‌చారం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు బాబు తార‌క్ ను తిరిగి పార్టీలోకి చేర‌దీసిందిలేదు. ఈ క్ర‌మంలో మ‌రి మేన‌ల్లుడు మామ మాట‌కు ఎంత మేర‌కు విలువ ఇస్తాడో చూడాలి. అదీకాక‌, అప్ప‌ట్లో తార‌క్ ప్ర‌చారం చేసినా.. బాబు ఓడిపోయాడు. మ‌రి 2019 లో గెలుస్తాడ‌ని న‌మ్మ‌కం ఉందా? సో.. ఇలాంటి వాటికి స‌మాధానం కావాలంటే.. వేచి చూడాల్సిందే.