వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?

బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని నేత‌. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా సాగిన ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు. విభ‌జ‌న‌తో కునాల్లిన కాంగ్రెస్‌ను వ‌దిలేసి వ‌చ్చి.. వైఎస్ త‌న‌యుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొద‌ట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వ‌చ్చేందుకు తాత్సారం చేసినా.. త‌ర్వాత త‌ర్వాత వైసీపీ అధికార ప్ర‌తినిధి స్థాయిలో మాట్లాడ‌డం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కొడుకు లోకేష్‌ల‌పైనా వారి వ్యాపారం హెరిటేజ్‌పైనా ఆయ‌న విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు కూడా.

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. దీంతో వైసీపీలో జోష్ మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే బొత్సా కూడా త‌న వాయిస్‌ను పెంచారు. ఇటీవ‌ల విశాఖ భూ కుంభ‌కోణంపై ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో విరుచుకుప‌డ్డారు. అధికార ప‌క్షం చేసిన కామెంట్ల‌కు ఎదురు కామెంట్లు చేయ‌డంతోపాటు.. నిరూపిస్తే.. అంటూ స‌వాల్ కూడా రువ్వారు. ఒక ర‌కంగా అధికార ప‌క్షంపై బొత్సా పైచేయి సాధించారు. దీనిని నిశితంగా గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. బొత్సాను మ‌రింత‌గా ప్రోత్స‌హించ‌డం చేశారు.

ఉత్తరాంధ్ర జిల్లాలపై బొత్సను పట్టు పెంచుకోవాల్సిందిగా వైసీపీ అధినేత జగన్ సూచించారని తెలుస్తోంది. దీంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తూ అధికార పార్టీని ఎండ‌గ‌డుతున్నారు. దీంతో వైసీపీలో బొత్స ప్రాధాన్యత అమాంతంగా పెరిగిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇటీవల మంత్రులు సుజయ కృష్ణ రంగారావు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపైనా బొత్స చేసిన విమర్శలకు జగన్ నుంచి అభినందనలు అందినట్లు చెబుతున్నారు. సో.. వైసీపీలో బొత్సా నెంబ‌ర్ టూ స్థాయికి ఎదిగార‌నే ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.