`తూర్పు`లో జ‌న‌సేన‌లోకి భారీ జంపింగ్‌లు

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలియ‌దు గానీ.. నేత‌లు మాత్రం ఆ పార్టీలో చేరాల‌ని ఉవ్విళ్లూ రుతున్నారు. ఎప్పుడెప్పుడు జ‌న‌సేనాని `ఊ` అంటారా.. ఎప్పుడెప్పుడు పార్టీలోకి చేరిపోదామా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సామాజిక‌వర్గం బ‌లంగా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇప్పుడు నేత‌లంతా ప‌వ‌న్ స‌ర‌స‌న చేరేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌. జిల్లాలో పవన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్న నేతలు ప్రయత్నాలను ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ముఖ్యంగా కాపు రిజ‌ర్వేష‌న్ అంశం ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూప‌తుంద‌ని భావించిన వీరంతా.. ఇప్పుడు జ‌న‌సేన కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్నార‌ట‌.

జ‌నసేనపై ఏపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ చెప్పడంతో ఆ పార్టీవైపు వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు పట్టున్న తూర్పు గోదావరి జిల్లాలో ఈ సీన్ కనిపిస్తోంది. ఇందులో ఎక్కువ మంది మాజీలే ఉండటం విశేషం. ఒకపక్క జనసేన కార్యకర్తల ఎంపిక కోసం కసరత్తులు చేస్తుంటే మరోవైపు పవన్ పార్టీలో చేరేందుకు కొందరు సిద్ధమవుతూ నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా లో కాపు ఓటర్లు ఎక్కువ. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి పవన్ మద్దతు ఇవ్వబట్టే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచామని ఇప్పటికీ చెబుతుంటారు.

వీరిలో మాజీ ఎంపీ వంగా గీత ఇందులో ముందు వరసలో ఉన్నారు. ఆమె రాజకీయంగా ఏ పార్టీలోనూ లేరు. కానీ ఇటీవల ఆమె పవన్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక‌ తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పంతం నానాజీ, కాకినాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా నిన్నమొన్నటి వరకూ ఉన్న దొరబాబు, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పవన్ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయక పోవడంతో అధికార పార్టీపై కాపు ఓటర్లు అసంతృప్తిగా ఉంద‌ని గ‌మ‌నించిన వీరంతా భావిస్తున్నార‌ట‌. టీడీపీకి చుక్కెదురు అవ్వొచ్చ‌ని.. క‌నీసం ప‌వ‌న్‌తో వెళితే ఎమ్మెల్యే అయినా దక్కుతుందని భావిస్తున్నారు.

టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతంలో టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లిన ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక‌ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దొమ్మాటి వెంకటేశ్వర్లు కూడా పవన్ పార్టీలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారు. మ‌రి వీరంతా ప‌వ‌న్ నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. యువ‌మంత్రం జ‌పిస్తున్న ప‌వ‌న్‌.. వీరికి ఎంతవ‌ర‌కూ అవ‌కాశ‌మిస్తార‌నేది ప్ర‌శ్న‌!