నంద్యాల‌లో గెలుపుపై టీడీపీ సెంటిమెంట్ అస్త్రం!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో విజ‌యం సాధించాలని మంచి క‌సిపై ఉన్న అధికార టీడీపీ.. ఆ దిశాగా అన్ని శ‌క్తుల‌ను ఒడ్డు తోంది. భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల ప్రియ‌కు ఇప్ప‌టికే ఈ విష‌యంలో అధినేత సీఎం చంద్ర‌బాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏం చేసైనా సీటు కొట్టాల‌ని, వైసీపీకి గుణ‌పాఠం చెప్పాల‌ని ఆయ‌న నూరి పోశారు. దీంతో ఆమె త‌న అమ్మ‌లు పొదిలోంచి సెంటిమెంట్ స‌హా అన్ని ర‌కాల ఆయుధాల‌ను ప్ర‌యోగిస్తోంది. త‌న అన్న బ్ర‌హ్మానంద‌రెడ్డి.. గెలుపే ధ్యేయంగా ఆమె అన్ని ర‌కాలుగా ముందుకు పోతోంది.

భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత ఏపీ అసెంబ్లీలో జరిగిన సంతాప తీర్మానానికి వైసీపీ అధినేత జగన్ హాజరుకాకపోవడాన్ని తప్పుపడుతూ నంద్యాల‌లో భారీ స్థాయిలో ప్రచారం చేయాల‌ని అఖిల ప్రియ నిర్ణ‌యించారు. ఫ‌లితంగా జ‌గ‌న్ ను ఓ విలన్ మాదిరిగా చూపించాల‌ని ఆమె డిసైడ్ అయ్యారు. వైసీపీ నేతలకు మానవత్వం అనేది లేదన్నది ఎష్టాబ్లిష్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆరోజు అసెంబ్లీలో జరిగిన సంతాప తీర్మానం వీడియోను వీధుల్లో ప్రదర్శించేందుకు, నేరుగా కేబుల్ ద్వారా టీవీల్లో ప్ర‌సారం చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.

అదేవిధంగా ఉచిత హామీల‌కు లెక్కే లేకుండా పోయింది. నంద్యాల, గోస్పాడు మండలాల్లో ఇప్పటికే వైసీపీ కార్యకర్తలను తమవైపునకు తిప్పుకునేందుకు నజరానాలు సిద్ధం చేస్తున్నారు. మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ, దళిత రైతులకు పది లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్లను 90 శాతం సబ్సిడీతో ఇవ్వడానికి రెడీ చేశారు. వీటిని కొందరు రాష్ట్ర మంత్రులను పిలిపించి వారి చేతుల మీదుగా పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు అఖిలప్రియ.

ఎల‌క్ష‌న్ నోటిఫికేష‌న్ వ‌చ్చే స‌మ‌యంలోగానే కాగ‌ల కార్యం చేయాల‌ని మంత్రి నిర్ణ‌యించేశారు. ఈ నేప‌థ్యంలో బాబు కూడా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కాకుండా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. సో, ఏదేమైనా అఖిల ప్రియ‌.. అనుకున్నంత అమాయ‌కురాలు కాద‌ని అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు!!