చంద్ర‌బాబుపై ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ద‌క్షిణ భార‌త‌దేశంపై బీజేపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపుచూస్తోంద‌ని విరుచుకుప‌డుతుంటారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌!! ద‌క్షిణ భార‌త‌దేశాన్ని, నాయ‌కుల‌ను నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయ‌న తెలుగుదేశంపై పెట్టారు. ప్ర‌స్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్త‌రాది వ్య‌క్తిని నియ‌మించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత‌కు ప్ర‌శ్న‌ల బాణాలు సంధించారు. ఘాటైన ప‌ద‌జాలంతో నిల‌దీశారు. టీడీపీపై మాట కూడా ప‌డనీయ‌కుండా చేస్తూ.. క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలుస్తున్న ప‌వ‌న్‌.. ఒక్కసారిగా ఇలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం కొంత ఆశ్చ‌ర్యం క‌లిగించమాన‌దు.

తెలుగు నేలపై ఉన్న సుప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడైన ఐఏఎస్ అధికారులు దక్షిణ భారతదేశంలో లేరా? అలాంటివారు ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దొరకలేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలదీశారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై ఆయన ట్వీట్లతో విరుచుకుపడ్డారు. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ను ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టడాన్ని తాను వ్యతిరేకించనని.. కానీ ఉత్తరాదిలోని అమర్ నాథ్ వారణాసి మధుర లాంటి దేవాలయాల్లో దక్షిణాదికి చెందిన ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమిస్తారా? అలా ఎందుకు నియమించడంలేదు? అలాంటప్పుడు మనం ఎందుకు వారిని నియమించాలి? అని ఆయన నిలదీశారు. అంతేకాదు.. పత్రికల్లో వచ్చిన పలు క్లిప్పింగులనూ ఆయన ట్వీట్ చేశారు. ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం నియమించడం పట్ల దక్షిణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజాగా ఓ ఐఏఎస్ అధికారి దీనిపై మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించాలని, పవన్ ఇంతవరకూ ఈవిష‌యంపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అనేక విషయాల పట్ల స్పందించే ఆయ‌న దీనిపైనా స్పందించాలని కోరారు. ఆయ‌న కోరిన వెంట‌నే ప‌వ‌న్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. మ‌రి ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కు చంద్రబాబు స‌మాధానం చెబుతారో లేక ష‌రామామూలుగానే లైట్ తీసుకుంటారో వేచిచూడాల్సిందే!!