టీడీపీకి మ‌రో ఎంపీ రాజీనామా? 

2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ప్ర‌స్తుత టీడీపీ ఎంపీల్లో చాలామంది రాజీనామాలు చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని, ఇందుకోసం ఎంపీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తాన‌ని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ప్ర‌క‌టించేశారు. అయితే ఇదే ప‌ద‌వి కోసం పోటీప‌డుతున్న ఎంపీ ముర‌ళీమోహ‌న్ కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం! ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా తిర‌గ‌లేక‌పోతున్నారు. త‌న వార‌సురాలిగా కోడ‌లు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టీటీడీ చైర్మ‌న్ అయ్యే అవ‌కాశాలుండటంతో.. ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల్లో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కూడా ఒకరు. వచ్చే ఎన్నికల నాటికి తన వారసురాలిగా కోడలిని రంగంలోకి దింపాలని మురళీమోహన్‌ ఒక స్పష్టమైన ఎజెండాతోనే ముందుకు వెళుతున్నారు. ఎంపీ అయినప్పటికీ.. ఆయన తరఫున అధికార బాధ్యతలను పర్యవేక్షిస్తూ చక్రం తిప్పే బాధ్యతను ఇప్పుడు ఆయన కోడలు రూపాదేవి పంచుకుంటున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అయినప్పుడు.. తర్వాత అనారోగ్యంగా ఉన్న స‌మ‌యంలో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో రూపాదేవి పూర్తిస్థాయిలో నియోజకవర్గం అంతటా తిరుగుతూవచ్చారు.

ప్ర‌స్తుతం టీటీడీ చైర్మ‌న్ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ప‌ద‌వీకాలం ముగుస్తోంది. మ‌రోసారి ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్క‌డం అనుమాన‌మే! దీంతో ఇప్పుడు కొత్త చైర్మ‌న్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న పార్టీలో మొద‌లైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీలు మురళీమోహ‌న్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ముర‌ళీమోహ‌న్‌పై చంద్ర‌బాబుకు సాఫ్ట్‌కార్న‌ర్ ఉంద‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల‌కు కొత్త అయినా చంద్ర‌బాబుకు స‌న్నిహితుడిగా పేరొందారు. అంతేగాక వివాద‌ర‌హితుడిగా ఉండ‌టం ఆయ‌న‌కు ప్ల‌స్‌!

అటు సినీ ఇండ‌స్ట్రీలోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర‌తో దూసుకుపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఇక రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.