లాలు కేసులో సంచ‌ల‌నం న‌మోదు?

అక్ర‌మార్కుల కేసులో త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళకు జైలు శిక్ష విధించిన అనంత‌రం.. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శ‌శిక‌ళ‌ త‌ర్వాత ఎవ‌రు అనే దానిపై అనేక పేర్లు వినిపించినా.. ఇప్పుడు బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప‌శుగ్రాసం కుంభ‌కోణం కేసులో సుప్రీం కోర్టు సోమ‌వారం తీర్పు వెలువ‌రించ‌నుండ‌టంతో ఏం జ‌రుగుతుందోన‌నే టెన్ష‌న్ అంద‌రిలోనూ మొద‌లైంది. అక్ర‌మార్కుల‌పై కేంద్రం సీరియ‌స్‌గా దృష్టిపెట్ట‌డంతో పాటు.. సుప్రీం సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న స‌మ‌యంలో.. లాలూ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

దేశాన్నికుదిపేసిన ప‌శుగ్రాసం కుంభ‌కోణంపై అత్యున్న‌త న్యాయ స్థానం మ‌రికొన్ని గంట‌ల్లో తీర్పు వెలువ‌రించ‌బోతోంది. బిహార్‌లోని ప‌శుసంవ‌ర్థ‌క శాఖ విభాగంలో గ్రాసానికి సంబంధించిన వెయ్యి కోట్ల కుంభ‌కోణంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ అధ్య‌క్షుడు అయిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ప్ర‌ధాన నిందితుడు. దీనివ‌ల్లే ఆయ‌న ప‌ద‌వి నుంచి దిగిపోయి, భార్య ర‌బ్డీ దేవిని సీఎం పీఠంపై కూర్చోపెట్టాల్సి వ‌చ్చింది. ఏప్రిల్ 20న తుది విచార‌ణ ముగిసిన అనంత‌రం తీర్పును రిజ‌ర్వులో ఉంచింది. వారంలోగా నిందితులంద‌రూ త‌మ త‌మ అభిప్రాయాల‌ను ఇవ్వాల‌ని కోరింది. త‌న‌కు విధించిన జైలు శిక్ష‌ను స‌వాలు చేస్తూ లాలూ కూడా పిటిష‌న్ ఫైల్ చేశారు.

ఆ పిటిష‌న్‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. లాలూపై ఒక కేసును జార్ఖండ్ హైకోర్టు ఉప‌సంహ‌రించుకోవ‌డాన్ని సీబీఐ స‌వాలు చేసింది. ఒకే కేసులో ఒకే వ్య‌క్తిని రెండుసార్లు విచారించ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను అనుస‌రించి, ఒక కేసును సీబీఐ ఉప‌సంహ‌రించుకుంది. ఐపీసీ 201 (సాక్ష్యాల‌ను అదృశ్యం చేసిన నేరం) కింద లాలూ విచార‌ణ‌ను కొన‌సాగించ‌వ‌చ్చ‌ని సుప్రీం ఆదేశించింది. యావజ్జీవ ఖైదు లేదా జైలు శిక్ష‌కు అర్హ‌మైన నేరం ఐపీసీ 511 కింద కూడా ఆయ‌న్ను విచారించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. అధికారంలో ఉన్న బీజేపీ అవినీతి కేసుల‌ను అస్స‌లు స‌హించ‌డం లేదనేది ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్‌ల కేసులు దీనికి సాక్ష్యం. ప్ర‌భుత్వ వైఖ‌రి క‌ఠినంగా ఉండ‌టంతో చ‌ట్టం త‌న పని తాను చేసుకుపోతోంది. ర‌ప్పించ‌డం అసాధ్య‌మ‌నుకున్న విజ‌య్ మాల్యాను ఇండియాకు తీసుకురావ‌డానికి వీలుగా కేంద్రం బ్రిట‌న్ ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మ‌రి ఈ స‌మ‌యంలో లాలూ కేసు తెర‌పైకి రావ‌డం.. తుది తీర్పు వెలువ‌డ‌నుండ‌టంతో.. బిహార్ ప్ర‌జ‌ల్లో ఉత్కంఠ నెల‌కొంది. మరి ఆయ‌న‌కు కోర్టు విధించే శిక్ష పైనే ఇక భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.