కృష్ణా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు నో టిక్కెట్‌

2019 ఎన్నిక‌ల వేళ ఏపీలో చాలా జిల్లాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఊస‌ర‌వెల్లి రంగులు మార్చిన విధంగా… ఊహ‌కు అంద‌కుండా ఉండేలా ఉంది. మ‌రోసారి అధికారం నిలుపుకునేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న టీడీపీ, తొలిసారి అధికారంలోకి వ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న విప‌క్ష వైసీపీ, తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తోన్న జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ర‌స‌వత్త‌ర స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉంటే వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తోన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కేటాయింపులో అనూహ్య‌మైన షాకింగ్ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా ఉన్న‌వారు, ప‌నితీరు స‌రిగా లేని వారు, భారీ అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్న వారిని త‌ప్పించాల‌ని ఆయ‌న ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్టు ఇవ్వ‌ర‌న్న చ‌ర్చ‌లు జిల్లాలోను, అమ‌రావ‌తి స‌ర్కిల్స్‌లోను జోరుగా వినిపిస్తున్నాయి.

జిల్లాలోని విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య‌, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు టిక్కెట్లు ఇవ్వ‌ర‌న్న‌దే ఇప్పుడు జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బొండా ఉమాపై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న జ‌రిగిన టైంలో త‌న‌కు బెర్త్ రాలేద‌ని, ఉమా త‌నకు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డాన్ని ఏకంగా కాపు వ‌ర్గంతో లింకు పెట్టి చేసిన వ్యాఖ్య‌లు చంద్ర‌బాబులో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఇక ఉమా దందాల‌తో పాటు ఆయ‌న కుమారుడు వ్య‌వ‌హార శైలితో కూడా పార్టీకి చాలా త‌ల‌నొప్పులు వ‌చ్చాయి. ఇక ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం కూడా ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారింది. త‌ర‌చూ కాంట్ర‌వ‌ర్సీల‌తో వార్త‌ల్లో ఉంటోన్న ఉమ కంటే అక్క‌డ మ‌రో వ్య‌క్తిని రంగంలో దించాల‌ని బాబు భావిస్తున్నారు.

నందిగామ నుంచి ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందిన తంగిరాల సౌమ్య‌పై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఆమె తీరు వ‌ల్ల టీడీపీకి కంచుకోట లాంటి నందిగామలో ఆ పార్టీ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అక్క‌డ ఆమెను మార్చ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు క‌ష్ట‌మ‌న్న నివేదిక ఇప్ప‌టికే చంద్ర‌బాబు వ‌ద్ద ఉండ‌డంతో సౌమ్య స్థానంలో ఒక‌రిద్ద‌రి పేర్లు ఇప్ప‌టికే బాబు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది.

ఇక న‌గ‌రానికి అనుకునే ఉన్న టీడీపీ కంచుకోట పెన‌మ‌లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌కు ఎర్త్ త‌ప్పేలా లేదు. ప్ర‌సాద్ ప‌నితీరు బాగున్న‌ప్ప‌ట‌కీ ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ఎంతోమంది కన్ను ఉంది. చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్‌, మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, దివంగ‌త మాజీ మంత్రి దేవినేని నెహ్రూ త‌న‌యుడు దేవినేని అవినాష్, ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే పెన‌మ‌లూరులో గెలుపు గ్యారెంటీ అన్న ధీమాతో అక్క‌డ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది క్యూలో ఉన్నారు. దీంతో ఇక్క‌డ బోడే ప్ర‌సాద్‌ను త‌ప్పించి ఆయ‌న‌కు మ‌రో ప‌ద‌వి ఇచ్చి ఇక్క‌డ లోకేశ్ లేదా మ‌రో వ్య‌క్తిని పోటీ చేయించాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే తెలుస్తోంది.