ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై లోకేష్ షాకింగ్ కామెంట్స్‌

హరికృష్ణ‌- చంద్ర‌బాబు కుటుంబాల మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరుగుతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే హ‌రికృష్ణ కుటుంబాన్ని చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టేసిన విష‌యం తెలిసిందే! ఇదేస‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు, మంత్రి లోకేష్‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. అంతేగాక తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్ట్ టైమ్ పొలిటీషియ‌న్ అని లోకేష్ వ్యాఖ్యానించ‌డం అటు పార్టీలోనూ.. ఇటు రాజ‌కీయాల్లోనూ తీవ్రంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇది పార్టీలో కొంత‌మంది మనోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో త‌న ప్రాణాలను సైతం లెక్క‌చేయ‌కుండా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఒక ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టీడీపీ, ఎన్టీఆర్ మ‌ధ్య విబేధాల‌పై ప్ర‌శ్నించ‌గా.. ఎన్టీఆర్‌, టీడీపీల మ‌ధ్య దూరం లేదని, రాజ‌కీయాలంటే ఫుల్ టైమ్ నాయ‌కులు అవ‌స‌ర‌మ‌నీ, పార్ట్ టైమ్ వ్యాపారం కాద‌ని లోకేష్ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. పార్టీలోని కొన్ని వ‌ర్గాలు ఈ వ్యాఖ్య‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. రాజ‌కీయాల్లోకి జూనియ‌ర్‌ను ఎవ‌రు తీసుకొచ్చార‌ని ప్ర‌శ్నిస్తున్నాయి.

నిజానికి, జూనియ‌ర్ ను రాజ‌కీయాల్లోకి లాగిందెవ‌రు? 2009 ఎన్నిక‌ల్లో అత‌డితో ప్ర‌చారం చేయించింది ఎవ‌రు? రోడ్డు ప్ర‌మాదం జ‌రిగినా, ఆసుప‌త్రిలో మంచం మీద క‌ద‌ల్లేని స్థితిలో ఉన్నా ప్ర‌సంగాలు ఇప్పించింది ఎవ‌రు? అంటే అన్నింటికీ ఒకే స‌మాధానం అదే చంద్ర‌బాబు!! హెరిటేజ్ వ్యాపారాలు చూసుకునే లోకేష్ ని పాలిటిక్స్ లోకి తెద్దామ‌ని నిర్ణ‌యించుకున్నారో.. అప్ప‌ట్నుంచీ జూనియ‌ర్ ను పార్టీకి దూరం చేయ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే! ఒక్క జూనియ‌రేం ఖ‌ర్మ‌.. ఏకంగా ఎన్టీఆర్ కుటుంబాన్నే తెలుగుదేశంలో ప్రాధాన్య‌త లేని మామూలు వ్య‌క్తులుగా మార్చేశారు చంద్ర‌బాబు. దీనిపై పార్టీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

మరి ఫుల్ టైం రాజ‌కీయ నాయ‌కులుగా పార్టీలో కొన‌సాగుతున్నసీనియ‌ర్లు ప‌య్యావుల కేశ‌వ్‌, ధూళిపాళ‌ న‌రేంద్ర‌, బుచ్చ‌య్య చౌద‌రి లాంటి వాళ్ల‌కి కేబినెట్‌లో చోటు ఎందుకు ద‌క్క‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వైసీపీలో గెలిచిన వారిని చేర్చుకున్న వారంతా ఫుల్‌టైం పొలిటీషియ‌న్సా? లేక పార్ట్‌టైం పొలిటీషియ‌న్సా అని నిల‌దీస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ విష‌యంలో లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ‌కు తెర లేపాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టికే కొన్నిసార్లు మాట‌లు త‌డ‌బడి.. నాయ‌కుల‌కు షాక్ ఇచ్చిన లోకేష్‌.. మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఏ ప‌రిస్థితుల‌కు దారితీస్తాయో?!!